Nagababu On AP Govt : ఏపీకి జగన్ ముఖ్యమంత్రి మాత్రమే రాజు కాదు, జీవో నెం 1 పై కోర్టుకెళ్తాం- నాగబాబు
Nagababu On AP Govt : రాజకీయ పార్టీల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం 1 ను నాగబాబు తప్పుబట్టారు. ఈ జోవోపై కోర్టుకెళ్తామన్నారు.
Nagababu On AP Govt : రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో పెట్టారు. వైసీపీ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి ఈ జీవో నిదర్శనం అన్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అన్నారు. ఈ జీవోపై కోర్టుకెళ్తే మరోసారి ఏపీ ప్రభుత్వానికి చివాట్లు తప్పవన్నారు. సభలు నిర్వహించినప్పుడు రాజకీయ పార్టీలు తగిన జాగ్రతలు తీసుకుంటాయన్నారు. అలాగే ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమన్న ఆయన... దానిని కారణంగా చూపిస్తూ ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఆపడం ఎవరివల్లా సాధ్యం కాదని నాగబాబు అన్నారు. గుంటూరు సభలో తొక్కిసలాటలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా ! pic.twitter.com/XmMozXJySt
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 3, 2023
నిరంకుశ పాలన
"ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించడంలో మీ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేశంలో అన్ని మతాల వాళ్లు, కులాల వాళ్ల తమ పండుగలకు సంబంధించి ర్యాలీలు చేసుకుంటారు. అదంతా నిబంధనలు తగిన విధంగా జరుగుతుంది. చంద్రబాబు సభల్లో ఇటీవల జరిగిన ఘటనల వంకతో ప్రతిపక్షాలు ర్యాలీలు నిర్వహించకుండా రూల్స్ పెడతారా? హోంశాఖ అలాంటి ఉత్తర్వులు ఇస్తుందా? ఏపీలో ప్రభుత్వం ఉందా? లేక రాచరికపాలన కొనసాగుతుందా? ప్రజల వద్దకు వెళ్లి తమ భావాలు చెప్పడం రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఈ రూల్ తీసుకొచ్చుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిరంకుశ అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తుంది." -నాగబాబు
ఈ జీవోపై కోర్టుకెళ్తాం
కోర్టులో ఈ జీవో నిలబడుతుందా అని నాగబాబు ప్రశ్నించారు. కోర్టులో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదన్నారు. రాజకీయ పార్టీల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, పోలీసుల ద్వారా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న చాలా పెద్ద తప్పు ఇది అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఎలా ఆపగలరని ప్రశ్నించారు. పవన్ , చంద్రబాబు లాంటి నేతలను ఎంత ఆపితే అంత బౌన్స్ అవుతారన్నారు. జీవో నెం.1 పై రాజకీయ పార్టీల పరంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ జీవోపై కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు. కోర్టుతో మొట్టికాయలు తినేలోగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి మాత్రమేనని, రాజు కాదని విమర్శించారు.