Yogi Vemana Statue : 'దుర్మార్గుడు సంఘానికి హాని చేస్తాడు'-యోగి వేమన విగ్రహం తొలగింపుపై పవన్ ఆగ్రహం
Yogi Vemana Statue : యోగి వేమన యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yogi Vemana Statue : యోగి వేమన పేరుతో ఏర్పాటైన యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్నే అధికారులు పక్కన పెట్టడం విమర్శలు వస్తున్నాయి. వేమన విగ్రహం స్థానంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టారు అధికారులు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో యోగి వేమన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వేమన విగ్రహం తొలగించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి పద్యాలతో కౌంటర్ ఇచ్చారు. మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ట్వీట్ చేశారు.
"విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం" అని పవన్ ట్వీట్ చేశారు.
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
— Pawan Kalyan (@PawanKalyan) November 10, 2022
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం. pic.twitter.com/w9MnvuTO4K
అసలేం జరిగింది?
యోగి వేమన పేరుతో ఏర్పాటైన యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఆ విగ్రహం స్థానంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో కడపలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆటవెలది పద్యాలతో సమాజంలో నైతిక విలువలు, మూఢ నమ్మకాలు, కుల వివక్షపై పోరాడిన ప్రజాకవి వేమన. ఆయనను స్మరించుకునేందుకు అప్పట్లో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా అధికారులు అత్యుత్సాహంతో ఆ విగ్రహాన్ని తొలగించి గేటు పక్కన ఏర్పాటుచేశారు. వేమన విగ్రహం స్థానంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రాయలసీమ విద్యార్థి సమాఖ్య నాయకులు స్పష్టం చేశారు.
దేశం మొత్తం వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టుకోండి- టీడీపీ
వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం తొలగింపు ఆంధ్రప్రదేశ్‌లో పెను దుమారం రేపుతోంది. ఈ చర్యపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో దేశంలో ప్రతి ప్రాంతంలో వైఎస్ విగ్రహాలు పెట్టుకోమని సూచన చేశారు. ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించడం మాత్రం సరైన పని కాదని ఆక్షేపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో విగ్రహాలు, పేర్లు మార్పు పాలన సాగిస్తోందే తప్ప... అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం... ఇప్పుడు వేమన విగ్రహాన్ని తొలగించడంపై శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో నైతిక విలువలు, కుల వివక్ష వంటి వాటి పై జనంలో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి వేమన అని అలాంటి వ్యక్తి విగ్రహం తొలగించడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన గొప్పతనాన్ని గుర్తించి అప్పట్లో దేశ ప్రధాని కార్యాలయం దగ్గర వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వేమన విశ్వవిద్యాలయ అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించి విగ్రహని తొలిగించి మరో చోటకు మార్చడం సిగ్గుచేటన్నారు. విగ్రహాల పాలన పోయి..ప్రజల సమస్యలు తీర్చే పాలన దగ్గరలోనే ఉందని..అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎక్కడున్నా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని ..లేని పక్షంలో టీడీపీ తరపున ఆందోళలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం విగ్రహాలను మారుస్తున్నారు..కానీ ప్రజలు జగన్ ప్రభుత్వన్ని మార్చే రోజులు దగ్గరలో నే ఉందని అన్నారు.