![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Narsipatnam : నర్సీపట్నం ఆసుపత్రిలో దారుణ ఘటన, సెల్ ఫోన్ వెలుగులో గర్భిణీకి డెలివరీ!
Narsipatnam : ఏపీలో కరెంట్ కోతలకు నిదర్శనం ఈ ఘటన. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కరెంట్ లేక సెల్ ఫోన్ లైట్ తో వైద్యులు ఓ మహిళకు ప్రసవం చేశారు. గంటల తరబడి విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
![Narsipatnam : నర్సీపట్నం ఆసుపత్రిలో దారుణ ఘటన, సెల్ ఫోన్ వెలుగులో గర్భిణీకి డెలివరీ! Alluri districts narsipatnam area hospital woman gave birth to child in cell phone light Narsipatnam : నర్సీపట్నం ఆసుపత్రిలో దారుణ ఘటన, సెల్ ఫోన్ వెలుగులో గర్భిణీకి డెలివరీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/3c3a7b63b31d1e21c5403c0c425bef13_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Narsipatnam Hospital : అల్లూరి సీతారామరాజు జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి కరెంట్ కష్టాలు వచ్చిపడ్డాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రిలో జనరేటర్ కూడా మరమ్మతులకు గురవ్వడంతో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. గాలి లేక రోగులు అవస్థలు పడ్డారు. అదే సమయంలో గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో సెల్ ఫోన్ లైట్లతో డెలివరీ చేశారు వైద్యులు. విద్యుత్ లేకపోవడంతో పసిపిల్లలు, రోగులు నిద్రలేని రాత్రిని గడిపారు. పవర్ కట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రోజు 10 నుంచి 12 గంటల పాటు పవర్ కట్ సమస్యతో ఆసుపత్రిలో నానా అవస్థలు పడుతున్నామని రోగులు, వారి బంధువులు తెలిపారు.
కొవ్వొత్తులు తెచ్చుకోమన్నారు
"నా భార్యకు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి చిన్నగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ కరెంట్ లేదు. నొప్పులు పెరగడంతో సిబ్బంది ప్రసవం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి పన్నెండు గంటలకు వెళ్లి కొవ్వొత్తులు తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెయ్యాలో తెలియక సెల్ ఫోన్ టార్చ్ ఇచ్చి పంపించాం. సాయంత్రం నుంచి కరెంట్ లేదు. జనరేటర్ కూడా లేదని సిబ్బంది చెబుతున్నారు. గర్భిణీలు, ప్రసవ వార్డుల్లో మహిళలు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు." అని స్థానికుడు తెలిపారు.
అల్లాడిపోయిన చిన్నారులు
ఆసుపత్రిలో గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చిన్న పిల్లలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నవజాత శిశువులకు తల్లిదండ్రులు, బంధువులు విసనకర్రలతో గంటల తరబడి విసిరాల్సిన పరిస్థితి కనిపించింది. గర్భిణీ మహిళల పరిస్థితులు మరింత దారుణంగా ఉందని బంధువులు తెలిపారు. గాలి లేక చెమటలు, ఉక్కపోతతో మగ్గిపోయారన్నారు. ఆసుపత్రి నిర్వహణ మరింత అధ్వానంగా ఉందని ఆరోపించారు.
కరెంట్ కోతలు
ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి అప్రకటిత కోతలు అమలుచేస్తున్నారు. డిమాండ్ కు తగిన సరఫరా అందుబాటులో లేకపోవడంతో కరెంట్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయాల్లో కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరీక్షల సమయంలో కోతలు విధించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రెండు వారాల పాటు పవర్ హాలిడే
ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలిడేకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలులో ఉంటుందని హరనాథరావు వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)