AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
పుంగనూరు ఘటనల్లో కేసులు నమోదైన వారందరికీ బెయిల్ లభించిది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.
AP News : చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది. మండలి సమావేశాలు జరుగుతుండటంతో ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన మరికొందరికి కూడా వూరట లభించింది. అంతకు ముందు హైకోర్ట్ ముందస్తు బెయిల్ ఇవ్వడంతో సీఐడీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిందని హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణ వరకూ వీరిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
మరో వైపు అంగళ్లు కేసులో చంద్రబాబును ఏ వన్ గా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు. అంగళ్లులో ర్యాలీ నిర్వహణ కోసం పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నామని చంద్రబాబు తన పిటిషన్‌లో తెలిపారు. ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికారపార్టీకి చెందినవారు తన కాన్వాయ్‌పై రాళ్లు వేశారని.. తమపైనే దాడి చేసి తిరిగి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని వెల్లడించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అదనపు అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరుకాలేకపోయారని.. విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. అయితే శుక్రవారానికి వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. ఆ మేరకు న్యాయమూర్తి వాయిదా వేశారు.
అంగళ్లు ఘటనలో చంద్రబాబుతో సహా వందలాది కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 317మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లు పెట్టారు. 81 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కొంత మంది ఘటనా స్థలంలో లేకపోయినప్పటికీ కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో అమెరికాలో ఉన్న ఓ టీడీపీ నేతపై పోలీసులు ఏఫ్ఐఆర్ నమోదు చేయడంపై బాధిత టీడీపీ నాయకుడు విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి RJ వెంకటేష్ జూలై 11న తాను అమెరికాకు వెళ్లానని, అప్పటి నుండి నేను అమెరికాలోనే ఉన్నానని, అలాంటి సమయంలో తాను పుంగనూరు అల్లర్లలో ఎలా పాల్గొంటానంటూ ఆయన ప్రశ్నించారు. లీసులు అధికార పార్టీ చెప్పినట్లు టీడీపీ నాయకులపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమని అన్నారు. అయితే పోలీసులు నిజాలు తెలుసుకుని కేసులు పెట్టాలని అన్నారు.