Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !
Andhra News : వాలంటీర్లను వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. వారిని తక్షణం తప్పించాలని సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు దువ్వాడ శ్రీనివాస్ పైనా స్పందించారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈసీ కూడా వాలంటీర్ల అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు విధుల అప్పగింతకు సంబంధించి కీలక సూచనలు చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖరాసింది. ఇదే సమయంలో ఎన్నికల్లో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపైనా ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఈవోకు ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది. ప్రతీ పోలింగ్ బూత్‌లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని ఈసీ సూచించింది. అయితే ఓటర్ల వేలుకు ఇంకుపూసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దంటూ ఏపీ సీఈవోకు లేఖలో సూచించింది. అలాగే బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని.. వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.
అయితే వాలంటీర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నేతలు.. వారి ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నరు. పథకాలు అందవని బెదిరించేలా చేస్తున్నరు. ఈ కారణంగా విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.