Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని కేంద్రం తెలిపింది. మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది.
Amaravati In LokSabha : మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని రాజసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. అమరావతి రాజధానిని విభజన చట్టం ప్రకారమే నిర్ణయించారని తెలిపారు. రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రం చెప్పిందా .. అలా చెప్పి ఉంటే.. మూడు రాజధానుల విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దానికి విరుద్ధంగా ఉన్నట్లే కదా అని.. వైఎస్ఆర్‌సీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.
రాజధాని అంశంపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల కింద నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని.. ఆ కమిటీ రిపోర్టును కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి పంపిందన్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేసిందని.. 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం బిల్లులు తెచ్చిందని తెలిపారు.
మూడు రాజధానుల చట్టాల గురించి కేంద్రానికి చెప్పలేదన్న కేంద్రమంత్రి
పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారన్నారు. ఆ తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఈ చట్టాలను చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజదాని అంశం కోర్టుల పరిధిలో ఉందన్నారు.
విభజన చట్టం ప్రకారం అమరావతిని ఖరారు చేశారన్న నిత్యానందరాయ్
అమరావతిపై కేంద్ర మంత్రి సమాధానం రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి విరుద్ధంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని కేంద్రం చెప్పినందున.. ఇక మళ్లీ మళ్లీ మార్చడం సాధ్యం కాదని చెప్పినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల గురించి అసలు కేంద్రానిక ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పడంతో.. అసలు ఆ నిర్ణయాలతో కేంద్రానికి ఏం సంబందం లేదని చెప్పినట్లయిందని అంటున్నారు.
సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం ఇదే చెబితే అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
ఇప్పటి వరకూ బీజేపీ నేతలు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని నేరుగా చెప్పడానికి కేంద్ర మంత్రి సంశయించారు. విషయంలో కోర్టులో ఉందని చెప్పడంతో పాటు.. అమరావతి విభజన చట్టం ప్రకారం ఏర్పాటయిందని క్లారిటీ ఇచ్చారు. త్వరలో సుప్రీంకోర్టులో జరగనున్న అమరావతి కేసుల విచారణ సమయంలోనూ.. కేంద్రం ఇదే తరహాలో అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది అమరావతి రైతులకు మరింత ఊరటనిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.