3 రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం - ఈశాన్య రుతు పవనాల ఆగమనంపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 3 రోజుల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదిలి సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు, అరేబియా సముద్రంలోనూ ఓ వాయుగుండం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఈశాన్య రుతు పవనాల ఆగమనంపై రాబోయే 3 రోజుల్లోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
నైరుతి నిష్కృమణ
మరోవైపు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతు పవనాలు నిష్కృమించినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతు పవనాలు జూన్ 8న కేరళను తాకాయి. క్రమంగా దేశమంతా విస్తరించగా ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి.
ఈసారి భిన్న పరిస్థితులు
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు విభిన్నంగా ప్రభావం చూపాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకూ వీటి ప్రభావం ఉండగా, ఈ సమయంలో కనీసం ఐదారు అల్ప పీడనాలు, వాయుగుండాలు, ఒకట్రెండు తుపానులు సంభవించే అవకాశం ఉంది. కానీ, ఈ సీజన్ లో ఇప్పటివరకూ 4 అల్ప పీడనాలే ఏర్పడ్డాయి. కాగా, ఇప్పటివరకూ 16.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది.