Machilipatnam YSRCP : బందరు పోర్టుకు శంకుస్థాపనపై వైఎస్ఆర్‌సీపీలో రచ్చ - చెరో తేదీ చెబుతున్న ఎమ్మెల్యే నాని , ఎంపీ శౌరి !
బందరు పోర్టుకు శంకుస్థాపన ముహుర్తంపై మచిలీపట్నం వైఎస్ఆర్‌సీపీలో ముసలం ఏర్పడింది. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారు.
Machilipatnam YSRCP : మచిలీపట్నం వైఎస్ఆర్‌సీపీలో బందరు పోర్టు అంశంపై చిచ్చు రేగింది. సీఎం జగన్ పుట్టిన రోజు నాడు బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తామని ఇంతకు ముందు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించుకుండా.. కనీసం మాట్లాడకుండా.. పోర్టు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారు చేయడం ఏమిటని మాజీ మంత్రి పేర్ని నాని కినుక వహించారు. ఈ అంశంపై ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పనులు.. రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. వీరిద్దరూ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనతో మచిలీపట్నం వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం ఏర్పడింది.
గుంటూరుకు చెందిన వల్లభనేని బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల కారణంగా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అక్కడ ఆయన విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నానికి ఆయనకు విభేధాలొచ్చాయి. ఎంపీ తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని పేర్ని నాని అసహనానికి గురవుతున్నారు. వారి మధ్య పలుమార్లు వివాదాలు రావడంతో.. హైకమాండ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. కలసి పని చేయాలని సూచించింది. అయినా మార్పు రాలేదు. ఇటీవల బందరు పోర్టుకు సంబంధించి టెండర్లను ఖరారు చేశారు. దాంతో సీఎం జగన్ పుట్టిన రోజు నాడు శంకుస్థాపన చేస్తామని ఎంపీ ప్రకటించేశారు. బందరు పోర్టు నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు అవసరమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ బ్యాంకులు కూడా ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయని ఎంపీ ప్రకటించారు.
ఎంపీ ప్రకటనను తాజాగా పేర్ని నాని పరోక్షంగా ఖండించారు. బుధవారం ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని.., ఎంపీ పేరును .. పోర్టు విషయంలో ఆయన చేసిన ప్రకటన గురించి ప్రస్తావించకుండా.. బందరు పోర్టు నిర్మాణ పనులు జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 1736 ఎకరాల ప్రభుత్వ భూమిలో తొలి విడత పోర్టు పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రైలు కం రోడ్డు కనెక్టివిటీకి 235 భూసేకరణ చేపట్టాల్సి ఉందని.. రెండు నెలల్లో సేకరణ పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా 2023 సెప్టెంబర్ నుండీ బందరు మెడికల్ కాలేజీ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రజల బందరు పోర్ట్ కల ఇప్పటి వరకూ సాకారం కాకపోవడం దురదృష్టకరమన్నారు.
బందరు పోర్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుందన్నారు. పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. రూ.5,253.89 కోట్లతో బందరు పోర్ట్ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. మొత్తంగా ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అభివృద్ధి పనులపైనా ప్రభావం చూపుతోంది. మచిలీపట్నం పోర్టు కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత పోర్టు కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో మూడున్నరేళ్లుగా అక్కడ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు కొత్తగా మేఘా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ప్రారంభతేదీపై వివాదం ఏర్పడింది.