Ananthapuram News: అయ్యో చిట్టి తల్లీ - నిమ్మకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల పసికందు మృతి
Andhra News: నిమ్మకాయ ఓ చిన్నారి ప్రాణాలు బలిగొంది. 9 నెలల చిన్నారి నిమ్మకాయ గొంతులో ఇరుక్కుని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
Child Died After Lemon Stuck in Throat in Ananthapuram: బుడి బుడి అడుగులు చిన్నారి. అప్పటి వరకూ సరదాగా ఆడుకుంటోంది. ఈ క్రమంలో వరండాలో ఆడుకుంటూ.. అక్కడ పడిన నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. హృదయ విదారక ఈ ఘటన అనంతపురం జిల్లాలో బుధవారం జరిగింది. తమ గారాల పట్టి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఇదీ జరిగింది
అనంతపురం (Ananthapuram) జిల్లా పెద్దవడుగూరు (Peddavaduguru) మండలం మల్లేనిపల్లెలో బుధవారం తీవ్ర విషాదం జరిగింది. గ్రామానికి చెందిన వాలంటీర్ సకీదీప, గోవిందరాజుల దంపతుల కుమార్తె జశ్విత (9 నెలలు) ఆడుకుంటూ ఇంటి వరండాలో పడిన నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. దీన్ని గమనించిన తల్లి వెంటనే దాన్ని బయటకు తీసేందుకు యత్నించింది. అయితే, అది చిన్నారి గొంతులోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో మెరుగైన వైద్య కోసం పామిడి తరలించారు. అయితే, చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఏడేళ్ల తర్వాత ఆ దంపతులకు బిడ్డ పుట్టిందని.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఆ చిన్నారి వారికి దూరమైందని స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు.
అటు తెలంగాణలోనూ
అటు, తెలంగాణలోనూ (Telangana) బుధవారం రాత్రి ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. ఝార్ఖంఢ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ గత కొంతకాలంగా రంగారెడ్డి (RangaReddy) జిల్లా ఫరూఖ్ నగర్ (Farook Nagar) మండలం ఎలికట్ట (Elikatta) గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి దావత్ చేసుకుందామని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో చికెన్, పూరీ వండుకున్నారు. మద్యం సేవించి భోజనం చేస్తుండగా.. జితేంద్రకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ధర్మేందర్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. మద్యం ఎక్కువగా తాగి ఉంటాడని, అందుకే స్పృహ కోల్పోయి ఉంటాడని భావించాడు. కాసేపటి తర్వాత అనుమానంతో జితేందర్ శ్వాస తీసుకోవడం లేదని గ్రహించిన ధర్మేందర్ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో జితేందర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య వెళ్లాలనుకునే తెలుగు వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
- ఉత్తరప్రదేశ్(Uttarpradesh) అయోధ్య(Ayodhya )లో రామ మందిరం(Ram Mandir) ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది.