AP Rains News Update: ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
Rains In Andhra Pradesh | ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక

Andhra Pradesh Rains News Update | అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, పాత భవనాల కింద తలదాచుకోరాదని సూచించారు.
సోమవారం నాడు వర్షాల వివరాలు
సెప్టెంబర్ 15న ఏపీలోని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 14న) సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81 మిల్లీ మీటర్లు, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిల్లీ మీటర్లు, పెద్దకూరపాడులో 40.2 మిల్లీ మీటర్లు, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లా ముక్కములలో 39 మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు. గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో రాబోయే4రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు pic.twitter.com/OkaA7Gk7Kq
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 14, 2025
ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో బీభత్సం..
ఉత్తరాదిన పలు రాష్ట్రాలను ఆకస్మిక వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. పలుచోట్ల రోడ్లు బ్లాక్ కావడంతో ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రోజులక కిందట యమునా నది ప్రమాదకర స్థితిలో ప్రవహించింది. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నేడు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 17న సాధారణ తేదీకి బదులుగా మూడు రోజుల ముందే సెప్టెంబర్ 14, 2025న పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోమాయి. సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో పశ్చిమ రాజస్థాన్‌పై యాంటీ-సైక్లోనిక్ అభివృద్ధి చెందింది. గత వరుసగా 5 రోజులుగా ఈ ప్రాంతంలో వర్షపాతం లేదు. మధ్య ట్రోపోస్పియర్ వరకు ఈ ప్రాంతంలో వాతావరణంలో తేమ తగ్గింది. రెండు, మూడు రోజుల్లో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకోనున్నాయి.






















