Southwest Monsoon : తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు- గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
Southwest Monsoon : ఉక్కపోతతో అల్లాడిపోవాల్సిన టైంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఈ ఏడాది రోహిణి కార్తె లోనే వానలు కురుస్తున్నాయి.

Southwest Monsoon : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకినట్టు పేర్కొంది. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇన్ని రోజులు ముందుగా రుతుపవనాలు తెలుగు నేలను తాకాయి. మధ్యాహ్నం సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మీదుగా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశించాయి. గత సీజన్‌లతో పోల్చుకుంటే దాదాపు పదిహేను రోజులు ముందుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి.
వాతావరణ మార్పులు, నైరుతి రుతుపవనాల రాకపై ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు నైరుతి రుతు పవనాలు విస్తరించాయని అందులో పేర్కొంది. వారం రోజులు ముందే నైరుతి పలకరించాయి. ఈ రుతు పవనాలకు తోడు రాష్ట్రంలో ఒక ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించి ఉంది. ఈ రెండింటి కారణంగా రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇప్పుడు ఉన్న వాతావరణ మార్పులతో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురు గాలులు ఉంటాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో రెండు రోజుల నుంచి జోరుగా వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలు పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు పిడుగులు పడతాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
అనుకున్న సమయాని కంటే ముందుగానే వచ్చిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో వాతవరణాన్ని కూల్ చేశాయి. రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో రుతుపవనాల ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రభుత్వాలు అప్రమత్తమై కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నాయి.





















