Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు
Konaseema District News: లంక ప్రాంతంలోని అందాల గురించి అందరికీ తెలుసు. కానీ అక్కడి రైతులు వేస్తున్న పొద్దుతిరుగుడు పంటతో ఆ ప్రాంతం మరింత అందంగా, సందడిగా మారింది.
Konaseema District News: గోదావరి పరివాహక ప్రాంత భూములను లంక భూములంటారు. అయితే సాధారణంగా ఈ లంక భూముల్లో ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, అరటి, పోక, కంద ఇలా అనేక రకాల ఉద్యాన పంటలే పండిస్తారు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే ఈ లంక భూముల్లో ముందెన్నడూ అక్కడ పరిచయం లేని పంటను వేసి సక్సెస్ సాధించారు లంక రైతులు. ప్రభుత్వం వారికి డీపట్టా భూములుగా ఇచ్చిన లంక భూముల్లో ఆక్వా చెరువుల్లాంటి కాలుష్య భరితమైన పంటలవైపు మళ్లకుండా అందంతోపాటు ఆహ్లాదం, ఆదాయం అందించే ఓ పంట వైపు దృష్టి సారించారు అక్కడి రైతులు.
అటు పశ్చిమగోదావరి, ఇటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మధ్యలో ఉండే వశిష్ట నదీపాయల మధ్య ఉన్న ఈ లంక ప్రాంతం అంతా ఇప్పుడు పొద్దు తిరుగుడు పంటతో ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం మండల పరిధిలోకి బెల్లంపూడి గ్రామ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ పొద్దుతిరుగుడు పంట సక్సెస్‌ఫుల్‌గా సాగు జరుగుతోంది.
ప్రయోగాత్మకంగా వేసిన ఈ పంట ఇప్పుడు ఏపుగా పెరిగిన పొద్దు తిరుగుడు మొక్కలతో అందంగా కనిపించే పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ లంక గ్రామ పరిధిలో సుమారు 200 ఎకరాల్లో చాలా మంది రైతులు పొద్దు తిరుగుడు పంటను వేశారు. ఇప్పుడు కొన్ని కమతాల్లో పంట చేతికందే దశకు చేరుకుంది. మరికొన్ని భూముల్లో పంట మొక్కల దశలోనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడో ఓసారి పొద్దు తిరుగుడు పంట వేసి ఆ పయ్రత్నాన్ని మానుకున్నారట.
ఇప్పుడు ఓ కంపెనీ సాయంతో విత్తనాలు, ఇతర పెట్టుబడులు సహకారం పొందుకున్న స్థానిక రైతులు పొద్దు తిరుగుడు సాగును బాగా చేస్తున్నారు. పొద్దు తిరుగుడు పంటతో బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని ఈ లంక గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందంటున్నారు. చాలా మంది పనిగట్టుకుని ఈప్రాంతానికి వచ్చి ఫొటో షూట్‌లు తీసుకుంటున్నారు. పొద్దుతిరుగుడు పంట పుణ్యమా అని ఈ ప్రాంతానికి చాలా మంది వస్తున్నారని, మా ప్రాంతానికి సరైన వసతులు కూడా కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
లాభసాటిగా మారిన ప్రత్యామ్నాయ పంట..
మెట్ట ప్రాంతాల్లో కనిపించే పొద్దు తిరుగుడు పంట ఇప్పుడు కోనసీమ జిల్లా పరిధిలోని లంక భూముల్లో కనిపిస్తుండగా.. ప్రత్యామ్నాయ పంటగా వేసిన రైతులకు ఈ పంట లాభ సాటిగానే ఉందంటున్నారు. ఎకరాకు కనీసం ఆరేడు క్వింటాళ్ల దిగుబడిగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తమ యాజమాన్య పద్దతులు పాటిస్తే 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆనందంగా చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుందని వివరిస్తున్నారు.
పొద్దు తిరుగుడు పంటతో ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొద్దు తిరుగుడు పువ్వుపై ఫలదీకరణ పౌడర్ ను అద్దుతూ మహిళా కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఇంత వరకు ఇక్కడ ఎక్కువగా మొక్కజన్న పంటనే వేసిన రైతులు ఈసారి పొద్దుతిరుగుడు పంట వేయగా దానికి గిట్టుబాటు ధర రాకనే ప్రయోగాత్మాకంగా ఈ పంటను వేసినట్లు రైతులు తెలిపారు.