గో సంరక్షణ రాయబారిగా కిచ్చా సుదీప్.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ను కర్ణాటక ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. గో సంరక్షణ రాయబారిగా నియమించింది.
Kiccha Sudeep: కర్ణాటక సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కు కర్ణాటక ప్రభుత్వం గొప్ప బాధ్యతలు అప్పగించింది. భారత దేశంలో గోవుల్ని దేవతల్లా పూజిస్తాం. ఆవులను నడిచి వచ్చే దైవంలా కొలుస్తారు హిందువులు. అలాంటి ఆవుల సంరక్షణకు పలు కార్యక్రమాల్ని కూడా చేపడతారు.
గో సంరక్షణ చర్యల్లో గుజరాత్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ మధ్య కాలంలో గోసంరక్షణ కోసం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు పుణ్యకోటి దత్తు యోజన పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి భారీ ప్రచారం కలిగించేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ను ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ విషయాన్ని పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
పథకానికి ప్రచారం కల్పించేలా..
గో సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న పుణ్యకోటి పశువుల దత్తత పథకాన్ని ప్రోత్సహించడానికి, పథకం గురించి ప్రచారం చేయడానికి పశుసంవర్థక శాఖ అంబాసిడర్ గా కన్నడ నటుడు, దర్శకుడు కిచ్చా సుదీప్ ను నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు కిచ్చా సుదీప్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
బీజేపీకి సపోర్ట్ ఇస్తారాని ఊహాగానాలు
గోశాలలో పశువులను పెంచడానికి ప్రజలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రోగ్రామ్ కు అంబాసిడర్ గా పని చేసినందుకు ఛార్జీ వసూలు చేయకూడదని నటుడు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే సుదీప్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వానికి కూా సపోర్ట్ ఇస్తారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీని వల్ల పార్టీకి మరింత మైలేజీ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
ఈగతో తెలుగు వారిని చేరువైన కిచ్చా సుదీప్
కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాజమౌళి, నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగ సినిమాలో సుదీప్ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కీలక పాత్ర పోషించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలోనూ కీలక పాత్ర చేశారు. దబాంగ్ 3 మూవీలో విలన్ పాత్ర పోషించారు. ఈ మధ్యే విక్రాంత్ రోనా సినిమాతో వచ్చారు కిచ్చా సుదీప్. విక్రాంత్ రోనా సినిమా మంచి హిట్ సాధించడంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించినట్లు అయింది.
కిచ్చా మూవీతో గుర్తింపు
కిచ్చా సుదీప్ కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. శాండల్ వుడ్ లో ఈయనకు అభిమానులు ఒక రేంజ్ లో ఉంటారు. సుదీప్ 1997లో తాయవ్వ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయ అనేక ప్రముఖ కన్నడ చిత్రాల్లో నటించాడు. ఇతర భాషా చిత్రాల్లో కూడా కనిపించిన అతి కొద్ది మంది కన్నడ నటుల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 2013 నుండి రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ కన్నడకు హోస్ట్ గా వ్యవహరించారు. 2001లో వచ్చిన కిచ్చా మూవీ తర్వాత సుదీప్ కాస్త కిచ్చా సుదీప్ అయ్యారు. కన్నడ పదం కిచ్చా అంటే కృష్ణుడు అని అర్థం వస్తుంది.