Anantapur News: ఎట్టకేలకు అనంతపురంలో ఇరిగేషన్ అడ్వైజరి బోర్డ్ సమావేశం- తీపి కబురు చెబుతారని రైతులు ఆశ
Anantapur: నేడు జరిగే ఇరిగేషన్ అడ్వైజరి బోర్డ్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకుంటారని కరవు నేలను నీళ్లతో తడుపుతారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Andhra Pradesh:దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహం లేదన్న చందంగా ఉంది ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప జిల్లాల రైతుల పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ రాయలసీమ జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులలో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీరు అందించాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు తహసిల్దార్లకు వినతి పత్రాలు సమర్పించుకుంటున్నారంటే నీటి ఎద్దడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నేడు ఐ ఏ బి సమావేశం :
నేడు అనంతపురంలో ఐ ఏ బి ( ఇరిగేషన్ అడ్వైజరి బోర్డ్ ) మీటింగు జరపనున్నారు. గత ప్రభుత్వంలో ఐ. ఏ. బి సమావేశం తూతూ మంత్రంగా జరిపేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పలుమార్లు ఐ ఏ బి సమావేశాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కరవుకు నేలవైన జిల్లాలలో చెరువుల్లో నీరు లేక బోరుబావులు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చాయి.
జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని చోట్ల తీవ్ర వర్షాభావం ఏర్పడింది. జిల్లాకు ప్రధాన నీటివనరుగా తుంగభద్ర,హంద్రీనీవా ఉన్నాయి. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ జిల్లాకు నేరు తీసుకురావడంలో వైఫల్యం కొనసాగుతున్న. హంద్రీనీవా నీరు వస్తున్నప్పటికీ వాటిని నేరుగా జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, ద్రాక్ష, అరటి తదితర పంటలు బోరు బావులు కింద సాగు చేశారు.
ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్న టైంలో ఐ. ఏ. బి సమావేశం నిర్వహిస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంటారని రైతులు, ప్రజలు ఆశగా చూస్తున్నారు. నీటి విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జిల్లా జలాశయాలలో నీరు ఎంత ?
జిల్లాలోని పిఎబిఆర్ 11 టీఎంసీల కెపాసిటీగా ఇప్పటివరకు కేవలం 2.128 టీఎంసీల మీరు మాత్రమే చేరింది. తుంగభద్ర నుంచి పీఏబీఆర్‌లోకి 396 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇందులో పవర్ జనరేషన్‌కు 15 క్యూసేక్‌లు, తాగునీటికి 55 క్యూసెక్‌లు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండకు 25 క్యూసెక్కుల నీరు ఇంకిపోతున్నాయి. ఎంపిఆర్ డ్యాం కెపాసిటీ 5 టీ ఎం సిలు కాగా.. ఇప్పటివరకు కేవలం 1.55 టిఎంసి ల నీరు చేరింది. ఈ రకంగా నీరు వస్తుంటే జలాశయాలు ఎప్పుడూ నిండాలి రైతులకు ఎప్పుడు నీళ్లు అందిస్తారు అన్నది ప్రశ్నఅంతకంగా మారింది.
జలాశయాల్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ నీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటున్నారు రైతులు. వీటన్నిటికీ ప్రధానంగా హెచ్ ఎల్ సి ఆధునికరణ పనులు పూర్తి కాకపోవడమే. లక్ష ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కింద నీరు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. గుత్తి బ్రాంచ్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్, మైలవరం రిజర్వార్ల ప్రాంతా రైతులకు ఈసారి పూర్తిస్థాయిలో నీరు అందటం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
హాజరుకానున్న మూడు జిల్లాల ప్రతినిధులు :
ఐ. ఏ. బి సమావేశానికి మూడు జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి కర్నూలు జిల్లా నుంచి ఆలూరు ప్రజాప్రతినిధులు.. కడప జిల్లా నుంచి పులివెందుల, జమ్మలమడుగు ప్రజాప్రతినిధులు.. అనంతపురం నుంచి మంత్రులు పర్యావరణ కేశవ్, సత్య కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.