Pasu Bima Scheme: ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతులకు గుడ్ న్యూస్- రూ.384 చెల్లిస్తే చాలు బోలెడన్ని లాభాలు!
Pasu Bima Scheme: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంరక్షణ కోసం పశు బీమా పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలి? ఎవరు అర్హులో ఇక్కడ చూద్దాం.

Pasu Bima Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాకాలం సీజన్‌లో పశువులు ప్రమాదాలు, జబ్బుల బారిన పడుతుంటాయి. అందుకే కేవలం 384రూపాయలు చెల్లించి బీమా చేయిస్తే మూడేళ్ల వరకు వాటికి ఏదైనా ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. మళ్లీ మీరు నిలదొక్కనేందుకు డబ్బులు చెల్లిస్తుంది. అంతేకాకుండా పశువులకు దాణా కూడా రాయితీపై అందిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
పాడి రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పశు బీమా పథకం'ను అమలు చేస్తోంది. జాతీయ పశుసంవర్ధక మిషన్ (ఎన్‌ఎల్‌ఎమ్) కింద ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పశువులు, గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం అందిస్తోంది. పాడి రైతులు 20 శాతం ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం 80 శాతం రాయితీ ఇస్తుంది. ఈ బీమా మూడు సంవత్సరాల వరకు వర్తిస్తుంది. రైతు 384 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం 1,536 రూపాయలు భరిస్తుంది. మొత్తంగా 1,920 రూపాయల ప్రీమియం బీమా సంస్థలకు చెల్లిస్తారు. దీంతో పశువులకు 30,000 రూపాయల బీమా కవరేజ్ వస్తుంది.
ప్రధానంగా ఈ స్కీమ్ ఎస్‌సీ, ఎస్‌టీ, బీపీఎల్ రైతులకు 80 శాతం వరకు రాయితీ, ఏపీఎల్ రైతులకు 50 వరకు రాయితీ ఇస్తారు ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ,"పాడి రైతులు తమ పశువులను రక్షించుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అకాల మరణం, ప్రమాదాలు, వ్యాధుల వల్ల నష్టపోయినప్పుడు ఆర్థిక సాయం అందుతుంది" అని పేర్కొన్నారు. గతంలోని వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకాన్ని సవరించి, ఇప్పుడు బీమా రూపంలో మరింత విస్తరించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 3.2 కోట్ల పశువులు కవర్ అవుతాయి పేర్కొన్నారు.
ఎవరు అర్హులు?
ఈ పథకానికి అన్ని వర్గాల పాడి రైతులు అర్హులుగా ప్రభుత్వం తెలియజేసింది. పశువుల వయస్సు ప్రకారం ఆవులు 2-10 సంవత్సరాలు, గేదెలు 3-12 సంవత్సరాలు. గొర్రెలు, మేకలు 6 నెలలు పైబడి ఉండాలి. కుటుంబానికి సంవత్సరానికి 10 పశువులు (ఆవులు/గేదెలు), 100 గొర్రెలు/మేకలు వరకు బీమా చేయవచ్చు. ఇప్పటికే ఇతర బీమా ఉన్న పశువులు, ఎస్‌డీఆర్‌ఎఫ్/ఎన్‌డీఆర్‌ఎఫ్ కవర్ అయినవి మినహా అన్ని పెంపుడు జంతువులు కూడా ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయి. రైతులు ఆధార్, రైస్ కార్డు కలిగి ఉండాలి. పశువులకు ఇనాఫ్ స్కీమ్ కింద ట్యాగింగ్ తప్పనిసరి చేయాలి.
బీమా ప్రయోజనాలు:
మేలు జాతి పశువులు అకాల మరణం చెందితే 30,000 రూపాయలు , లోకల్ జాతి పశువులు చనిపోతే 15,000 రూపాయలు లభిస్తాయి. గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తు చనిపోతే 6,000 రూపాయలు. ప్రమాదాలు అంటే ప్రకృతి విపత్తులు, మంటలు, విద్యుత్ షాక్ వల్ల చనిపోయినా కవర్ అవుతుంది. అంతేకాకుండా వ్యాధులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అదనంగా, పశువుల దాణాకు 50% రాయితీ లభిస్తుంది. ఒక బస్తా (50 కేజీలు) ధర 1,110 రూపాయలు, ఇందులో 550 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఇప్పటికే అమలులో ఉంది.
ఎలా అప్లై చేయాలి?
మొబైల్ యాప్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆధార్ ఆథెంటికేషన్ లేదా ఓటీపీతో లాగిన్ అయి, రైతు వివరాలు (పేరు, వయస్సు, కులం), పశువుల వివరాలు నమోదు చేయాలి. పశువుల ఫోటోలు (లాటిట్యూడ్, లాంగిట్యూడ్, తేదీతో) అప్‌లోడ్ చేయాలి. పశుసంవర్ధక సహాయకుడు (ఏహెచ్‌ఏ) సహాయంతో ప్రక్రియ పూర్తవుతుంది. ప్రీమియం చెల్లింపు ఆన్‌లైన్‌లో లేదా స్థానిక కార్యాలయంలో ఎక్కడైనా చెల్చించవచ్చు.
ఎక్కడ అప్లై చేయాలి?
సమీప పశుసంవర్ధక కేంద్రం, రైతు సేవా కేంద్రం (ఆర్‌బీకే) లేదా వెటర్నరీ ఆఫీసర్‌ను సంప్రదించాలి. హెల్ప్‌లైన్ 1962కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లా పశుసంవర్ధక అధికారులు (డిడి ఆఫీస్)లో కూడా అప్లికేషన్ సమర్పించవచ్చు.
క్లైమ్ ఎలా చేసుకోవాలి:
పశువు మరణించిన వెంటనే 1962కు సమాచారం ఇవ్వాలి. పోస్ట్‌మార్టమ్, క్లైం ఫామ్, ఆధార్, బ్యాంక్ వివరాలు సమర్పించాలి. 15 రోజుల్లో డీబీటీ ద్వారా డబ్బు జమ అవుతుంది. ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక భద్రత పొందుతారు. ప్రభుత్వం రైతులను ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. మరిన్ని వివరాలకు స్థానిక పశుసంవర్ధక కార్యాలయాన్ని సంప్రదించండి





















