Farmers movement: రైతు ఉద్యమంలో అపశ్రుతి- అన్నదాత మృతి, పోలీసుల కాల్పులే కారణమా?
పంజాబ్ - హరియాణా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడం లాంటి ఘటనలతో హింస చెలరేగింది.
Farmer's movement: వ్యవసాయ(Agriculture) ఉత్పత్తులకు సంబంధించి ఇస్తున్న కనీస మద్దతు ధరల(MSP)కు చట్ట బద్ధత కల్పించాలని.. రైతుల(Aged Farmer)కు, కూలీలకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దేశ రాజధాని `ఢిల్లీ ఛలో`(Delhi Chalo)కు పిలుపునిచ్చిన రైతు ఉద్యమం... రక్త సిక్తమైంది. హరియాణా, పంజాబ్ సరిహద్దుల్లో రైతులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అన్నదాతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తిరగుబాటు చేశారు. చేతికి అందివచ్చిన వస్తువుతో పోలీసులపై దాడులు ముమ్మరం చేశారు.
డిమాండ్ల పరిష్కారానికి పట్టు!
వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్(Swaminadhan) కమిషన్ సిఫారసుల(Recomondations)ను అమలు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని, వయో వృద్ధులైన రైతులకు పింఛన్ ఇవ్వాలని కోరుతూ.. గత 10 రోజులుగా పంజాబ్(Punjab), హర్యాణా(Haryana) రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులను నిలువరించేందుకు హరియాణా ప్రభుత్వం రహదారులపై గోడలే నిర్మించేసింది. అదేసమ యంలో కేంద్ర బలగాలను తీసుకువచ్చి.. పెద్ద ఎత్తున మోహరించింది. అయినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను మరింత తీవ్ర తరం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య దాడులు కూడా చోటు చేసుకున్నాయి. రైతులపై భాష్ప వాయువును ప్రయోగించడంతో ఇప్పటి వరకు ముగ్గురు రైతులు పూర్తిగా దృష్టిని కోల్పోయారు. రెబ్బర్ బుల్లెట్లు తగిలి పలువురు రైతులు కాళ్లు, చేతులు కోల్పోయారు. ఇక, పోలీసులు పెల్లెట్లతో విరుచుకుపడడంతో రైతులు తీవ్రంగా గాయపడుతున్నారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎన్నికలకు ముందు ఈ పరిణామాలను నిశితంగా గమనించి.. 4 సార్లు చర్చలు జరిపింది. అయితే.. రైతుల డిమాండ్లను యథాతథంగా మాత్రం అంగీకరించలేదు. వ్యవసాయ ఉత్పత్తులనను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామని ఒక ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే.. ఈ ప్రతిపాదనలో మోసం ఉందంటూ రైతులు.. కేంద్రం పెట్టిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఫలితంగా మరోసారి ఉద్యమం ఉద్రుత మైంది. బుధవారం ఉదయం నుంచి హరియాణ, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లీ సరిహద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.
చెలరేగిన హింస
పంజాబ్ - హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం రాత్రి.. యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, రైతులు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు తీవ్ర గాయమై 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు కాల్పుల వల్లే సింగ్ మరణించాడని అన్నదాతలు ఆరోపించారు. ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులూ గాయపడ్డారు. 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. శంభు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే.. పోలీసుల కాల్పుల కారణంగానే రైతు మృతి చెందాడా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఉద్యమం వాయిదా..
తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు అప్రమత్తమయ్యారు. ‘ఢిల్లీ చలో’ నిరసనను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
చర్చలకు రెడీ..
రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. కనీస మద్దతు ధరలు సహా ఏ విషయంలోనైనా సమగ్రంగా, సంపూర్ణంగా చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముంఢా(Arjun munda) తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులు శాంతీయుతంగా వ్యవహరించాలని, రెచ్చగొట్టేలా, ఎదురుదాడి చేసేలా వ్యవహరించవద్దని సూచించారు. ఇదిలా ఉంటే పంజాబ్ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆందోళనల నేపథ్యంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా ప్రత్యేక బృందాన్ని పంజాబ్ కు పంపించింది. ఈ బృందం శాంతి భద్రతలపై పంజాబ్ ప్రభుత్వంతో చర్చించనుంది.