Annadata Sukhibhava: రైతుల సంక్షేమంకు పెద్దపీట వేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ కమైన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.ఈక్రమంలోనే శనివారం ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు లాంఛనంగా ప్రారంభించి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయ్యేలా చెక్కు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో రైతుకు రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 2025-26 వ్యవసాయ సీజన్ కు తొలి విడతగా ఈ మొత్తం నిధులు ప్రభుత్వం రైతులకు ఇస్తోంది. రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల వారీగా (ఆర్బీకే)ల వారీగా అర్హులైన రైతుల జాబితా రూపొందించి ఈకే వైసీ ప్రక్రియను పూర్తిచేశారు. రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో రూ.3,174 కోట్లు జమ అవుతున్నాయి.
46.86 లక్షల మంది రైతులకు లబ్ధి
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46.86 లక్షల మంది రైతులకు మొదటి విడతగా రూ.7 వేలు చొప్పున ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం అందిస్తోండగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు దఫాలుగా విడుదల కానున్న అన్నదాత సుఖీభవ లబ్ధి గతంలో కంటే అదనంగా రూ.6,500 రైతులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. గత ప్రభుత్వంలో మూడు విడతల్లో రూ.13,500 జమ అయ్యే పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వంలో మొదటి విడతలో రూ.5వేలు, రెండో విడతగా రూ.5 వేలు, మూడో విడతగా రూ.4 వేలు మొత్తం రూ.14 వేలు అర్హులైన ప్రతీ రైతుకు ఆర్థిక సాయం చేస్తోంది.దీనికి ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా వచ్చే నిధులు అదనం అవుతాయి. మొత్తంగా 20 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం
చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆర్థిక భద్రతను నిర్ధారించడం వంటి లక్ష్యంతో ప్రారంభమైన ఈ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు బాసటగా నిలుస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుతున్న వేళ వీరికి సీసీఆర్సీ కార్డులను జారీ చేస్తున్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సాయంగా ఈ నిధులు ఉపయోగపడడంతో వారిలో ఆనందం వెల్లువిరుస్తోంది..
లబ్ధిదారుల జాబితాలో పేరు లేకుంటే ఇలా చేయాలి
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం అందిస్తోన్న లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా రైతుల పేర్లు లేకున్నా, వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోయినా గ్రామాల్లో అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. భూ సంబంధిత అవసరమైన పత్రాలు, భూమి పట్టాపత్రాలు లేదా కౌలు ఒప్పందం (కౌలు రైతులకు), ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో సంప్రదిస్తే వారు పరిశీలనచేసి లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడానికి ప్రధాన కారణం దరఖాస్తు సమయంలో e-KYC సాంకేతిక లోపాలున్నా డబ్బులు జమ కావంటున్నారు. అందుకే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.