Ambati Rambabu: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెమో జారీ చేశామన్న మంత్రి అంబటి
అకాల వర్షాలు, విపరీతంగా వీచిన గాలులతో రైతులకు పంట నష్టం వాటిల్లిందని, ఆ బాధిత అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు.
AP Minister Ambati Rambabu : అకాల వర్షాలు, విపరీతంగా వీచిన గాలులతో రైతులకు పంట నష్టం వాటిల్లిందని, ఆ బాధిత అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. మార్చి 17, 18, 19, 20న కురిసిన అకాల వర్షాలకు, వీచిన గాలులకు అరటి, మునగ, మామిడి, మిర్చి రైతుల నష్టపోయారు. నష్ట పోయిన రైతుల అందరికీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆర్ధిక సహాయం అందజేస్తుందన్నారు. నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తరపున రైతులకు అందాల్సిన సహయం వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటాం
మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయం చేయకపోయినా ఇన్ పుట్ సబ్సిడీ వల్ల కాస్త అయిన ఊరట అందుతుంది అన్నారు. ఈ నెల 30 తేదీ లోపు నష్టపోయిన రైతులు తమ తమ రైతు భరోసా కేంద్రాల వద్ద నష్ట పోయిన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం దీనిపై ఓ మెమో కూడా జారీ చేసిందన్నారు. అగ్రికల్చర్ (Agriculture), హార్టికల్చర్ డిపార్ట్ మెంట్లకు వివరాలు సేకరించాలని సూచించినట్లు చెప్పారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి మూడో తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహణ ఉంటుంది. 1850 ఎకరాల వ్యవసాయ పంట, 100 ఎకరాల ఉద్యాన పంట నష్టం జరిగింది అని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్,శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పంట అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు.. డెడ్ లైన్ మార్చి 30
హార్టికల్చర్ కు సంబంధించి 109 హెక్టార్లను ఎన్యుమరేట్ చేశారు. అయితే ఇది ఫైనల్ కాదని, మార్చి 30 వరకు ఎన్ని అవుతాయో అన్ని హెక్టార్ల రైతులకు పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించిన తరువాత ఆడిట్ చేసి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి నష్టపోయిన అన్నదాతలకు ఊరట కలిగించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఏప్రిల్ 3 తరువాత ఫైనల్ లిస్ట్ తయారుచేసి అన్నదాతలకు ఇన్ పుట్ సబ్సిడీ (Input subsidy to Farmers) ఇస్తామన్నారు. రైతుల నష్టాన్ని పూడ్చలేకపోయినా ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఊరట కలుగుతుందన్నారు. మిర్చి, మామిడి, మునగ, మొక్కజొన్న, అరటి పంట, బొప్పాయి పంట, వరి సహా మరికొన్ని పంటలు అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయాయన్నారు.
తొలి పండుగ నాడు అన్నదాతల కోసం..
ఏపీ ప్రజలకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అంబటి. తొలి తెలుగు పండుగ ఉగాది నాడు అన్నదాతలు బాధ పడకూడదని, వారికి ప్రభుత్వం ఉంటుందన్నారు. నష్టపోయిన పంటల అంచనా వేసి, కొంతమేరకు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మంత్రులను, అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. త్వరగా కలెక్టర్లతో మాట్లాడి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి, అర్హుల జాబితా సిద్దం చేసి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.