Mulugu DMHO Appaiah Dedication | ప్రభుత్వ అధికారిగా తన నిబద్ధతను చాటుకున్న డా. అప్పయ్య | ABP Desam
షర్ట్ విప్పేసి...షూస్ చేతిలో పట్టుకుని..నడుంకు తాడు కట్టుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈ పెద్దాయన స్టోరీ వింటే ఇంత అంకిత భావంతో కదా ప్రభుత్వాధికారులు పనిచేయాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన సాధారణ వ్యక్తేం కాదు తలుచుకుంటే ఏసీ రూమ్ కదలకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవచ్చు. కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులతో కాస్ట్లీ పార్టీలు చేసుకోవచ్చు కానీ ఈయన పేద ప్రజల ఆరోగ్యం తాపత్రయపడ్డారు. అందుకే ఈయన చేస్తున్న సాహసం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈయన పేరు అప్పయ్య. ములుగు జిల్లా వైద్యాధికారి. జిల్లా వైద్యాధికారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలందరికీ వైద్య సేవలు సరిగ్గా అందేలా చూడటం ఈయన బాధ్యత. అది ఎంతటి మారుమూల ప్రాంతానికైనా సరే అందాలని ఆయన కోరుకోవటమే ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. మనం చూస్తున్న ఈ నీటిపరివాహక ప్రాంతం అంతా వాజేడు మండలం పెనుగోలు గూడేనికి వెళ్లి దారి. గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి 16కిలోమీటర్ల పాటు కొండలు గుట్టలు, వాగుల మధ్య ఇలా ప్రాణాలకు తెగిస్తే కానీ అక్కడ నివసించే ఆదివాసీలకు వైద్యసహాయం చేయలేం. మాములు సమయంలోనే వీరు పక్కనే ఉన్న పట్టణాలకు వైద్యం తీసుకోవటం కష్టం. ఇక ఇలా వర్షాకాలం వచ్చిందంటే మరీ కష్టం. అందుకే మెడికల్ ఆఫీసర్ అప్పయ్య తన నలుగురు వైద్య బృందంతో కలిసి ఇంత సాహసం చేసి పెనుగోలు గూడెం వెళ్లారు.