బోరబండ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు, తీవ్ర ఉద్రిక్తత
బోరబండ పరిధి సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. సున్నం చెరువు FTL పరిధిలో ఉన్న భారీ అపార్ట్మెంట్లను, హోటళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి జేసీబీలతో జరుగుతున్నఈ కూల్చివేతలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. చెరువు ఏరియాలో కొంతమంది పేదలు ఇళ్లు వేసుకుని నివసిస్తుండగా వారంతా అధికారులపై తిరగబడ్డారు. పెట్రోల్ పోసుకుని చావమంటారా అంటూ బెదిరింపులకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోరబండ సున్నం చెరువు ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చమని స్పష్టం చేసింది. కొత్త నిర్మాణాలను మాత్రం కూల్చివేసే పనులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. FTL పరిధిలోని ఇళ్లు, స్థలాలను కొనుగోలు చేయొద్దని సూచించింది. FTL బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.