Denmark Couple Adopted Adilabad Kid | కన్నవారి కోసం డెన్మార్క్ నుండి వచ్చిన బాలుడు
తమ బిడ్డ ప్రాణం పోసుకున్న నేల కోసం, ఆ ప్రాణం పోసిన కన్నవారి కోసం డెన్మార్క్ నుంచి ఆదిలాబాద్ కు వచ్చారు లూయిస్ - రాస్ముస్ దంపతులు. 2016 సంవత్సరంలో రెండు నెలల పసికందుగా ఉన్న అర్జున్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రిమ్స్ ఆసుపత్రి సమీపంలో వదిలేశారు. ఆ చిన్నారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరగా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఈ విదేశీ దంపతులు అర్జున్ కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు డెన్మార్క్ లో వారితోనే పెరుగుతున్నాడు. అయితే, అడాప్టి రైట్ కౌన్సిల్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా అర్జున్ అసలు తల్లి దండ్రులను గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంస్థ ఇప్పటికే వంద మంది చిన్నారుల మూలాలను వెతికి పట్టుకుని, వారిని కన్నవారికి పరిచయం చేసింది. ఏడాదికోసారైనా అర్జున్ ను కన్నవారికి కలిపించాలనేది వీరి సంకల్పం.. బాలుడు పెద్దయ్యాక తన మూలాలు తెలియక మానసిక ఆవేదనకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ అన్వేషణ సాగిస్తున్నట్లు డెన్మార్క్ కు చెందిన దంపతులు, ముంబాయి హైకోర్టు అడ్వకేట్ ఎన్జీవో డైరెక్టర్ అంజలి పవార్ abp దేశం తో వెల్లడించారు. బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడని, దత్తత తీసుకున్న వారి దగ్గరే ఉంటాడని వారు స్పష్టం చేశారు. రెండు చేతుల వేళ్లకు వైకల్యం ఉండటం వల్లే ఆనాడు తల్లిదండ్రులు చిన్నారిని వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బాలుడిని గుర్తించిన వారు 9822206485, 8329403661 నంబర్లలో సంప్రదించవచ్చనీ, వారం రోజుల పాటు వారు ఆదిలాబాద్ లోనే ఉంటారన్నారు. వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, కన్నవారు తమ కుమారుడిని చూసే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తనను కన్న వారిని ఒక్కసారైనా చూడాలని ఆ బాలుడు సైతం ఆశపడుతున్నాడు. అయితే డెన్మార్క్ కు చెందిన దత్తత దంపతులు లూయిస్ రాస్ముస్ మరియు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అంజలి, అప్పటి CWC చైర్మెన్ మీర్జా యాకుబ్ బెగ్ ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.




















