Vaibhav Suryavanshi Special Gift to Rajasthan Royals | ఈ సీజన్ లో RR సాధించిన ఆణిముత్యం
పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు అంటూ మిర్చి సినిమాలో పాట ఉంటుంది కదా. సేమ్ అలా పండగలా రాజస్థాన్ రాయల్స్ కోసం దిగి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్ లోరాజస్థాన్ రాయల్స్ కథ నిన్న సీఎస్కే మ్యాచ్ తో ముగిసిపోయింది. ప్లే ఆఫ్స్ కి వెళ్లకుండానే లీగ్ దశలోనే ఆ టీమ్ ఇంటి దారి పట్టి ఉండొచ్చు...కానీ వైభవ్ సూర్య వంశీ ఈ 14ఏళ్ల ఈ పిల్లాడి సెలక్షన్ విషయంలో మాత్రం RR సూపర్ సక్సెస్. అసలు కోచ్ రాహుల్ ద్రవిడ్ అండ్ రాజస్థాన్ టీమ్ 14ఏళ్ల ఓ పిల్లాడికి గుట్టు చప్పుడు కాకుండా కోటీ 10 లక్షల రూపాయల ధరను ఆక్షన్ లో ఇచ్చినప్పుడే చాలా మందికి కళ్లు తిరిగాయి అసలు ఎందుకు ఇంత అమౌంట్ పెడుతున్నారు అంత చిన్న పిల్లాడికి అని. కానీ రాజస్థాన్ ఎప్పుడైతే సూర్యవంశీకి అవకాశం ఇచ్చిందో ఆడటానికి అప్పుడు అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాస్తవానికి సంజూ శాంసన్ కి గాయం అయ్యేంత వరకూ సూర్యవంశీ అనే ఈ అణువిస్పోటనాన్ని వాడలేదు RR. ఆ పిల్లాడు కదా ఏదో తీసుకున్నాం ఓ రెండేళ్లు ట్రైనింగ్ ఇద్దాం ముందు అనుకోలేదు. ఓపెనర్ గా ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కోమని ఇంత చిన్న పిల్లాడిని ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత పిన్న వయస్కుడిని బరిలోకి దింపింది. తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాదిన సూర్యవంశీ తనొచ్చానని చాటి చెప్పాడు. మొదటి మ్యాచ్ లోనే 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటై కన్నీళ్లు పెట్టుకుంటూ పెవిలియన్ కు తిరిగి వెళ్తున్న సూర్యవంశీని చూసి జాలి పడని క్రికెట్ ప్రేమికుడు లేడు. అయ్యో పిల్లాడు పాపం ఏడుస్తున్నాడు అనుకున్నారు. తన మూడో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఎప్పుడైతే సెంచరీ సాధించి...ఐపీఎల్ లో క్రిస్ గేల్ తర్వాత రెండో వేగవంతమైన సెంచరీ...ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారతీయుడిగా ఎప్పుడైతే నిలిచాడో అప్పుడు అందరిలోనూ షాక్. ఏంట్రా వీడు ఇంత వైలెంట్ గా ఉన్నాడు అని. 38 బంతుల్లో 101 పరుగులు చేసి తను ఫ్యూచర్ సూపర్ స్టార్ నని సచిన్ లా చిన్న వయస్సులో ఆట మొదలు పెట్టానని బలంగా ప్రపంచానికి చాటి చెప్పాడు వైభవ్. చక్రాల కుర్చీలో కూర్చున్న ద్రవిడ్ లేచి మరీ చప్పట్లు కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న పిల్లాడు ఎంతటి సంచలనమో అని. మళ్లీ రాజస్థాన్ ఆడిన ఆఖరి రెండు మ్యాచులైన పంజాబ్ మ్యాచ్ లో 40పరుగులు, లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద నిన్న 33 బాల్స్ లో 57పరుగులు చేసి...తన సెంచరీ గాలివాటం కాదని పరిస్థితులకు తగ్గట్లుగా ఆడే ఎబిలిటీస్ కూడా తనలో ఉన్నాయని ప్రూవ్ చేశాడు. మొత్తంగా ఆడిన 7 మ్యాచుల్లో ఓ సెంచరీ ఓ అర్థ సెంచరీతో 206 స్ట్రైక్ రేట్ తో 257పరుగులు చేశాడు. అంత చిన్న వయస్సు పిల్లాడికి ఈ స్కోర్ బోర్డ్ చాలా అంటే చాలా ఇంప్రెసివ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆర్ ఆర్ ఎలిమినేట్ అయ్యిండొచ్చు గాక..నెక్ట్స్ సీజన్ లోనూ వైభవ్ సూర్యవంశీ ఇదే ఫామ్ ను చూపిస్తే..రాజస్థాన్ రాయల్స్ కు అది కొండంత అండగా నిలవటంతో పాటు టీమిండియాకు, భారత జట్టు భవిష్యత్తుకు రాజస్థాన్ రాయల్స్, రాహుల్ ద్రవిడ్ గొప్ప మేలు చేసిన వాళ్లు అవుతారు. 16ఏళ్లకే టీమిండియాకు ఆడిన సచిన్ రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బద్ధలు కొట్టిన వాడవచ్చు ఏమో..చూడాలి .





















