Shubman Gill Fight With Umpires | GT vs SRH మ్యాచ్ లో అంపైర్లతో గొడవ పడుతూనే ఉన్న గిల్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతెలా అంటే అంపైర్ల వాదిస్తేనే తప్పు అలా వాళ్ల మీదకు కొట్టేంత స్థాయిలో వెళ్లటం ఇంకా పెద్ద తప్పు అని కూడా ఆలోచించట్లేదు శుభ్ మన్ గిల్. మీద పడి కలబడిపోతున్నాడు అంతే. నోరేసుకుని అరిచేస్తున్నాడు. ఈ సీజన్ అంతా అలాగే ప్రవర్తిస్తున్న గిల్..నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్ లో మాత్రం రెండు సందర్భాల్లో అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మొదటిది గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనను అంపైర్ రనౌట్ గా ప్రకటించటం గిల్ కు అసలు నచ్చలేదు. హర్షల్ పటేల్ వేసిన త్రోను పిక్ చేసిన క్లాసెన్ గిల్ వచ్చే లోపు స్టంప్స్ ను గిరాటేశాడు. అక్కడ వరకూ ఓకే. థర్డ్ అంపైర్ గిల్ ఇంకా క్రీజులోకి రాలేదని అవుట్ ఇచ్చాడు. అయితే అక్కడే ఇంకో విషయం అనుమానాస్పదంగా కనిపిస్తున్న దాన్ని చెక్ చేయకపోవటంపైనే గిల్ కోపం అంతా. గిల్ రాకముందే క్లాసెస్ స్టంప్స్ ను అయితే ఎగరేశాడు కానీ బాల్ కంటే ముందే తన గ్లవ్స్ తో క్లాసెస్ స్టంప్స్ ని తోస్తున్నట్లు కనిపిస్తోంది. అంపైర్ దాన్ని పట్టించుకోకుండా తనను కేవలం క్రీజులోకి బ్యాట్ రాలేదని చూసి రనౌట్ ఇవ్వటంపై గిల్ కి మండిపోయింది. డగౌట్ దగ్గర ఉండే ఫోర్త్ అంపైర్ తో గొడవకు దిగాడు గిల్. ఎంత కోపం అంటే ఆల్మోస్ట్ కొడతాడా ఏంటీ అనిపించింది. అలా అరిచాడు వాళ్ల మీద. తర్వాత సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ కాళ్లను నేరుగా బాల్ తాకితే గుజరాత్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అంపైర్ దాన్ని నాట్ అవుట్ అంటే..రివ్యూ కి వెళ్లింది గుజరాత్. రివ్యూలో అసలు బాల్ పిచ్ కాకుండా నేరుగా లో ఫుల్ టాస్ అభిషేక్ కాళ్లకు తగిలినట్లు స్పష్టంగా ఉంది. అయినా అంపైర్ పిచింగ్ అవుట్ సైడ్ అయ్యేలా ఉందని అంపైర్స్ కాల్ గా వదిలేశాడు. గ్రౌండ్లో అంపైర్ అప్పటికే నాటౌట్ ఇచ్చి ఉండటంతో అభిషేక్ నాటౌట్ అయ్యాడు. దీనిపై గిల్ మండిపడ్డాడు. చాలా సేపు ఆటను ఆపేసి మరీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అసలు ఫుల్ టాస్ బాల్ కి పిచింగ్ గోల ఏంటని అది కచ్చితంగా వికెట్లకు తగులుతుంది కనిపిస్తోందని కనుక అవుట్ అని గిల్ వాగ్వాదానికి దిగటంతో మ్యాచ్ చాలా సేపు నిలిచిపోయింది. ఆఖరకు అభిషేక్ శర్మ వచ్చి గిల్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ టైమ్ లో అభిషేక్ శర్మ మీద కూడా అరిచిన గిల్..తర్వాత తనకు సారీ చెప్పి బ్లెస్ చేశాడు. గ్రౌండ్ బయట నెహ్రా, గ్రౌండ్ లో గిల్ ఇంత అగ్రెసివ్ గా ఉంటూ అంపైర్లను కూడా వదిలిపెట్టకపోతుండటం చూస్తుంటే ఈసారి గుజరాత్ కి పొరపాటున కూడా ఫెయిల్ ప్లే అవార్డు అయితే రాదు.





















