చీఫ్ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ దంపతులతో పాటు ప్రధాని మోదీ గణనాథుడికి హారతి ఇచ్చి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ...మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే టోపీని బహుకరించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంట్లో గణపతి పూజలో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే..ఇదే సమయంలో ఇది వివాదాస్పదమూ అయింది. ఈ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే అవుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తేల్చిచెప్పారు. ప్రైవేట్ మీట్ కోసం సీజేఐ చంద్రచూడ్ తన నివాసానికి మోదీని అనుమతించడం షాకింగ్‌గా ఉందని అన్నారు. రాజ్యాంగ పరిధిలో పని చేసే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ట్వీట్ చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలూ దీన్ని తప్పుబడుతున్నారు.