హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం
ఇప్పటికే హమాస్ చీఫ్ సిన్వర్‌ని మట్టుబెట్టిన ఇజ్రాయేల్..ఇప్పుడు టార్గెట్‌ని హెజ్బుల్లా వైపు మళ్లించింది. గత నెల హెజ్బుల్లా కీలక నేత హసన్ నస్రల్లాని చంపేసింది. ఆ తరవాత ఆయన స్థానంలో హేషం సఫిద్దీన్ వచ్చాడు. హెజ్బుల్లా గ్రూప్‌కి కీలకంగా మారాడు. అప్పటి నుంచి ఇజ్రాయేల్ సఫిద్దీన్‌నీ చంపేందుకు ప్రయత్నిస్తోంది. చివరకు అతణ్ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయేల్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. హెజ్బుల్లా హెడ్‌క్వార్టర్స్‌పై గగనతలం నుంచి దాడుల్లో సఫిద్దీన్ చనిపోయినట్టు వెల్లడించింది. మూడు వారాల క్రితమే చంపేసినట్టు చెప్పింది. హెజ్బుల్లా పొలిటికల్ ఫోరమ్‌లో సభ్యుడిగా ఉన్న సఫిద్దీన్...డిసిషన్ మేకర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు.
ఇజ్రాయేల్‌పై దాడులకు ప్లాన్ చేశాడు. హెజ్బుల్లాకి సంబంధించి జిహాద్ కౌన్సిల్ మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటుంది. ఈ కౌన్సిల్‌లోనే సభ్యుడిగా ఉన్నాడు హేషం సఫిద్దీన్. నస్రల్లాకి కజిన్ అయిన సఫిద్దీన్... లెబనాన్‌లో హెజ్బుల్లాని పూర్తి స్థాయిలో సెక్రటరీ జనరల్‌గా లీడ్ చేస్తున్నాడు. అయితే...ఇజ్రాయేల్ చేసిన ప్రకటనపై హెజ్బుల్లా ఇంకా స్పందించలేదు. ఇజ్రాయేల్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా మిలిటెంట్స్‌కి సపోర్ట్ చేస్తోంది హెజ్బుల్లా. సఫిద్దీన్‌ని మట్టుబెట్టడం ద్వారా ఇజ్రాయేల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. హమాస్‌ని పూర్తిగా అంతం చేస్తామని...చీఫ్ సిన్వర్‌ని చంపి మరీ చెప్పింది. ఇప్పుడు హెజ్బుల్లా వైపు గురి పెట్టింది.