RCB Victory Parade Stampede Reasons | ఆర్సీబీ విజయయాత్రలో పెను విషాదానికి కారణాలివే | ABP Desam
18సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ తీసుకుని బెంగుళూరుకు వస్తే చూడాలని వచ్చిన అభిమానులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంతో కర్ణాటకలో తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 10మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారణాలుగా అభిమానుల అత్యుత్సాహం, ప్రభుత్వ నిర్లక్ష్యంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి విరాట్ కొహ్లీ సహా ఆర్సీబీ ఆటగాళ్లను బెంగుళూరు భారీ ఊరేగింపుగా తీసుకురావాలనేది ప్లాన్. అందుకోసమే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా ఎయిర్ పోర్టు కు వెళ్లి మరీ విరాట్ కు ఆర్సీబీ బృందానికి స్వాగతం పలికారు. అయితే ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఎయిర్ పోర్ట్ నుంచే విక్టరీ పరేడ్ నిర్వహిస్తే బెంగుళూరు స్తంభించిపోయే అవకాశం ఉన్నందున అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్ట్ నుంచి పోలీసు బందోబస్తు సాయంతో అభిమానులను కంట్రోల్ చేస్తూ ఆటగాళ్లను నేరుగా హోటల్ కు తీసుకెళ్లిపోయారు. అయితే హోటల్ నుంచి విధాన సౌధకు తిరిగి ఆటగాళ్లను తీసుకువచ్చారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆటగాళ్లను సన్మానించారు. ఆ తర్వాత అక్కడి నుంచి చిన్న స్వామి స్టేడియానికి ఆటగాళ్లను తీసుకువెళ్లారు. కానీ ఈ లోపే అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఐపీఎల్ తో వచ్చే విరాట్ ను చూడాలని అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. స్టేడియం గోడలు ఎక్కేసి ఫెన్సింగ్ లు విరగ్గొట్టి లోనికి వెళ్లేందుకు యత్నించారు. కార్లను ధ్వంసం చేశారు. వేలు, లక్షలుగా తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయటం ఇబ్బంది కావటంతో పోలీసులు అభిమానులను చెదరగొట్టేందుకు యత్నించారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది పది మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఓ చిన్నారి సహా ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనపై మాట్లాడిన డీకే శివకుమార్ పోలీసులు ఎంత ప్రయత్నించినా అభిమానులను కంట్రోల్ చేయలేకపోయమన్నారు. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు.





















