Operation Sindoor PM Modi Master Stroke | మోదీ, సైన్యం కలిసి కొట్టిన దెబ్బకు విలవిలాడుతున్న పాకిస్థాన్ | ABP Desam
కశ్మీర్ మీద దాడి చేశారు. అమాయకులైన పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఏ ఒక్కడినీ వదిలిపెట్టను. తప్పు చేసిన ప్రతీవాడికి వాడు కలలో కూడా ఊహించని శిక్షపడుతుంది. ఉగ్రవాదులను వాళ్లని పెంచి పోషిస్తున్న వాళ్లను మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ఇదీ ఏప్రిల్ 24న బిహార్ లో ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన మాట. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లో పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో 25మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా మూగగా రోదించిన ఘటన ఇది. ఊహించని విషాదాన్ని కడుపులో దాచుకుంటూ దేశాన్ని నడిపించిన నాయకుడిగా ప్రధాని మోదీ సంయమనంతో వ్యవహరించారు. త్రివిధ దళాలతో కూడిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ రెండు సార్లు జరిపిన మోదీ..దారుణానికి ఒడిగట్టిన ఉగ్రమూకలకు బుద్ధి ఎలా చెప్పాలా అని ప్రణాళికలు రచించారు. యుద్ధానికి దిగటం భారత్ కు కష్టం కాదు కానీ యుద్ధం తెచ్చే వినాశనం తెలిసి సమస్యకు పరిష్కారం కోసం అనేక మార్గాలను అన్వేషించారు. ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్, సీనియర్ కేబినెట్ మంత్రుల సలహాలతో ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్, పాకిస్థాన్ లలోని ఉగ్రవాద శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేయాలని. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. గత పదిహేను రోజులగా దీనికోసం అత్యంత రహస్యంగా ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అందిస్తున్న అండదండలు కూడా బాహ్య ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కృతమయ్యేలా ఏకంకాలంలో తొమ్మిది చోట్ల వేర్వేరు చోట్ల ఉగ్రశిబిరాలపై దాడులు చేయాలని ప్లాన్ చేశారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు. ఫలితంగా బయటి దేశాలు నోరెత్తకుండా ఈ విషయంలో చచ్చినట్లు భారత్ కే సపోర్ట్ చేసేలా రాజకీయ చతురతను ప్రదర్శించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తూనే ఎలా దాడులు చేయాలి..ఎప్పుడు చేయాలి..ఏక కాలంలో సమన్వయంతో శత్రుదేశానికి చిక్కకుండా ఉగ్రమూకలపై విరుచుకుపడటం ఎలా అనే విషయాలపై సైన్యానికి మోదీ పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేశారు. ఫలితమే ఆరో తారీఖు అర్థరాత్రి నుంచి మొదలై ఏడో తారీఖు తెల్లవారుజాము వరకూ జరిగిన ఆపరేషన్ సిందూర్. దెబ్బకు పాకిస్థాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎక్కడా పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేయకుండా..ఆ విషయాన్ని అధికారికంగా చెబుతూనే..కేవలం ఉగ్రశిబిరాలపై పంజా విసిరి పాకిస్థాన్ ప్రభుత్వానికి మింగలేని కక్కలేని ఓ విపరీతమైన పరిస్థితిని ఇప్పుడు తీసుకువచ్చి పెట్టారు మోదీ. ఇప్పుడిక పాకిస్థాన్ జుట్టుపీక్కోలేక...ఉగ్రవాద సంస్థలకు సమాధానం చెప్పుకోలేక..వాళ్ల అవస్థ చూడాలి. ఇదీ మోదీ మాస్టర్ ప్లాన్ అంటే.





















