ISRO GSLV F16 NISAR Lift off | నింగిలోకి దూసుకెళ్లిన NISAR | ABP Desam
ఇస్రో చరిత్రలో మరో ఘన విజయం చేరింది. నాసాతో కలిసి ఇస్రో తయారు చేసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం నైసార్ సూపర్ సక్సెస్ గా నింగిలోకి దూసుకువెళ్లింది. ఇందుకోసం జీఎస్ఎల్వీ ఎఫ్ 16 రాకెట్ సమర్థవంతంగా పనిచేసి అంతరిక్ష రంగంలో త్రివర్ణపతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. 2వేల 393కిలోల బరువున్న నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ NISAR ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా రెండూ అంతరిక్ష సంస్థలు కలిసి తయారు చేశాయి. ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహం కూడా. ఎందుకంటే దీని తయారీకి, ప్రయోగానికి అయిన ఖర్చు అక్షరాలా 12వేల 5వందల 75కోట్లు . అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందనేగా...ఉంది. ఈ ఉపగ్రహానికి రెండు సింథటిక్ అపెర్చర్ రాడార్ లు ఉంటాయి. ఇవి రెండు కలిసి ఓ భారీ డిష్ లా మారి అంతరిక్షంలో భూమిని చుడుతూ ఉంటుంది. 12రోజులకు భూమిని రెండుసార్లు చుట్టడం పూర్తి చేస్తుంది ఈ ఉపగ్రహం. అక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఒకేసారి భూమి మీద ఉన్న 20కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను ఈ ఉపగ్రహం ఫోటో లు తీయగలదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మేఘాలు, వర్షం, మంచు అనే తారతమ్యం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా భూమి ఉన్నా ఆ ప్రదేశాన్ని ఫోటో తీయగలగటం నైసార్ స్పెషాలిటీ. రోజుకు 80టీబీ డేటాను ప్రొడ్యూస్ చేయగల ఇంతటి భారీ టెక్నాలజీ ఉన్న ఉపగ్రహాన్ని ఇప్పటివరకూ ఏ స్పేస్ ఏజెన్సీ రూపొందచలేదు. ఇస్రో, నాసాలు మాత్రమే సంయుక్తంగా పనిచేసి ఈ ఘనతను సాధించాయి





















