India-Pak partition Days | దేశ విభజన సమయంలో జరిగిన సంఘర్షణలు|ABP Desam
200 ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకుంటున్న సమయం. స్వేచ్ఛ వాయువులతో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరబోతున్న తరుణం. 1947 ఆగస్టు 15 అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇదే. కానీ ఆ సందర్భంలో జరిగిన రక్తపాతం గురించి చాలామందికి తెలియదు. మరి ముఖ్యంగా, అప్పటి బ్రిటన్ ప్రధాని అట్లీ 1948 జూన్ 30 లోపు భారత్ కు ఇండిపెండెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ఇండియాకు లార్డ్ మౌంట్ బాటెన్ను పంపారు. ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి: ఒకటి ఇండియాను కలిపి ఉంచడం, మరొకటి రెండు దేశాలుగా విడగొట్టడం. సరిగ్గా ఇదే సందర్భంలో, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ప్రత్యేక దేశం సాధించడం కష్టమని ముస్లిం లీగ్ నాయకులు భావించారు. అందులో భాగంగా గాంధీ, నెహ్రూలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అది కాస్త హింసకు దారి తీసింది. స్వాతంత్ర్యం వస్తుందని సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో, కర్రలతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు ప్రత్యేక దేశమే కరెక్ట్ సమాధానం అనే విధంగా ముస్లిం లీగ్ నాయకులు పరిస్థితులు సృష్టించారు. దీంతో చేసేదేమీ లేక, జిన్నా కోసం ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని మొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ తరపున చెప్పారు. ఇలా అందరూ ఓకే చెప్పడంతో 1947 జూన్ 3న దేశ విభజన కన్ఫర్మ్ అయింది. ఇక శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ పరిస్థితులు మరింతగా దిగజారాయి. స్వాతంత్ర్యం వచ్చే ఒక్క రోజు ముందే ప్రజలకు అసలు కష్టాలేంటో కనిపించాయి. ఎంతోమంది కట్టుబట్టలతో పుట్టిన గడ్డను వదిలిపోయారు. ఎందుకంటే, అప్పుడు అధికారికంగా ఇది మీది, ఇది మాది అని నిర్ధారించారు. దీంతో, పాకిస్తాన్లో ఉన్న హిందువులను, ఇండియాలో ఉన్న ముస్లింలను వేరుగా చూడటం మొదలుపెట్టారు. వెళ్లిపోండి అంటూ కొట్టారు. వారి ఆస్తులను లాక్కున్నారు. కొన్నిచోట్ల చంపుకోవడం వరకు వెళ్లింది. దీంతో కట్టుబట్టలతో చాలామంది హిందువులు పాకిస్తాన్ను వీడారు. ముస్లింలు భారత్ నూ వీడారు. ఈ సంఘర్షణలు ఎక్కువగా పంజాబ్, బెంగాల్లో జరిగాయి. లాహోర్ నుంచి ఢాకా దాకా లక్షలాది మంది మరణించారు. 10 నుంచి 20 లక్షల మంది వలసలు వెళ్లిపోయారు. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద వలసగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు.





















