EVM Controversy | ఓటింగ్ మెషిన్లపై రాజకీయ రగడ..మస్క్ ను టార్గెట్ చేసిన బీజేపీ..? | ABP Desam
దేశంలో ఎన్నికల తుపాను తీరం దాటి చాలా రోజులైన తర్వాత.. విమర్శల వాన జోరందుకుంటుంది. చినుకు చినుకు కలిసి వరదలా మారేలా ఉంది. ప్రతి సారీ ఎన్నికలు అయిన తర్వాత జరిగే తంతే ఇది. ఈసారి కాస్త External మసాలా చేరడంతో కాస్త సౌండ్ ఎక్కువైంది.
దేశంలో సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతీసారీ గెలిచిన వారంతా ప్రజామోదం పొందామని ఓడిన వారు ఎన్నికల ఓటింగ్ యంత్రాల్లో లోపాలున్నాయని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఒకప్పుడు EVMలపై సందేహాలు వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఇప్పుడు వరుసగా మూడోసారి వాటితోనే గెలిచి.. దానిపై మౌనంగా ఉంటున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ యంత్రాలపై ఎప్పటి నుంచో సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నాయి. ఇది ప్రతీసారీ జరుగుతున్నదే. అయితే అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ఈవీఎంలపై కామెంట్ చేయడంతో దుమారం రేగింది. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ను అయినా AI సాయంతో మానిప్యులేట్ చేయొచ్చని మస్క్ Xలో చేసిన ఓ కామెంట్ భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. భారత ఎన్నికల సిస్టమ్‌లో తప్పులున్నాయని ఎలన్ మస్క్ నేరుగా చెప్పకపోయినా ఇక్కడ ఉన్న వ్యవస్థలో లోపాలపై మాట్లాడేందుకు అది అవకాశం ఇచ్చింది.