National Best Films 2023 | జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా | ABP Desam
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఇన్నాళ్లూ ఒకటీ రెండు అవార్డులు అది కూడా ఏదైనా భారీ చిత్రాలు వచ్చినప్పుడే దక్షిణాది సినిమాల వైపు జాతీయ అవార్డుల జ్యూరీ కన్ను పడుతుందనే విమర్శలు ఉండేవి. అయితే వాటిని పటా పంచలు చేస్తూ చిన్న చిన్న తెలుగు సినిమాలకు సైతం నేషనల్ అవార్డులు దక్కటం ఈ సారి అవార్డుల్లో ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ సామాజిక సందేశంతో తీసిన భగవంత్ కేసరికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కగా...మెయిన్ స్ట్రీమ్ అవార్డుల్లోనూ తెలుగు సినిమా దుమ్ము లేపింది. తెలంగాణ పల్లె వాతావారణాన్ని కళ్లకు కట్టిన బలగం లో గీత రచయిత కాసర్య శ్యామ్ రాసిన ఊరూ పల్లెటూరు పాటకు జాతీయ ఉత్తమ సాహిత్యం అవార్డు దక్కటం తెలుగు వాళ్లకు గర్వకారణంగా నిలిచే విషయం. ఇక బేబీ సినిమా, హనుమాన్ సినిమాలకు జాతీయ అవార్డులు వరించాయి. బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా పాటకు పీవీఎన్ఎస్ రోహిత్ కు ఉత్తమ సింగర్ గా నేషనల్ అవార్డు దక్కగా….సాయి రాజేష్ రాసిన బేబీ స్టోరీకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గా అవార్డునూ కైవసం చేసుకుంది. తక్కువ ఖర్చుతోనే విజువల్ గ్రాండియర్ ను క్రియేట్ చేసిన హనుమాన్ బెస్ట్ VFX నేషనల్ అవార్డు, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డులు దక్కాయి. ఇక డైరెక్టర్ సుకుమార్ గారాలపట్టి ఆయన కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ జాతీయ నటిగా గాంధీ తాత చెట్టు సినిమాకు గానూ జాతీయ అవార్డు అందుకోనుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ సినిమాకు మూడు నేషనల్ అవార్డుల దక్కినా అది హిందీ చిత్రంగా విడుదల కావటంతో తెలుగు ఖాతాలోకి రాలేదు. మొత్తంగా ఏడు నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో మెరిసిపోయింది.





















