Yogandhra Two Guinness World Records | గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన విశాఖ యోగాంధ్ర | ABP Desam
అంతర్జాతీయంగా భారతీయ యోగా ప్రాచుర్యం పొందేలా చేసే ఈ ఉత్సవం, విశాఖలో ప్రజల మద్దతుతో ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యంగా యువతతో మోదీ సంభాషించడం, వారిలో యోగా పట్ల ఆసక్తిని ప్రోత్సహించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విశాఖపట్నం సాగరతీరంలో ఘనంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్న ఈ చారిత్రాత్మక యోగా మహోత్సవంలో, 28 కిలోమీటర్ల పొడవైన యోగా పరేడ్ నిర్వహించబడింది. ఈ విశేష కార్యక్రమంలో మోదీతో పాటు వేలాది మంది యోగాభ్యాసకులు కలిసి యోగాసనాలు వేస్తూ ఒక నూతన చరిత్రను లిఖించారు.
సుమారు 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి.
ప్రపంచంలో అతి ఎక్కువ మంది కలిసి సూర్య నమస్కారాలు చేసిన కార్యక్రమంగా “యోగాంధ్ర” నిలిచింది.
అలాగే, అతి పెద్ద యోగా పాఠంగా కూడా ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు పొందింది.
ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఈ కాలంలో భాగస్వాములైన యోగా అభ్యాసకులు 28 కిలోమీటర్లలో విస్తరించి, శ్రద్ధగా యోగా పాఠాలు వినడమే కాకుండా వాటిని పాటించారు. ఈ రెండు రికార్డులను గిన్నిస్ ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించి, రాష్ట్ర మంత్రులకు అందజేశారు.
ఈ ఘన విజయంతో, ఏపీ ప్రభుత్వం నెలన్నర రోజులు వేసిన శ్రమకు ఫలితం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఈ విశిష్ట కార్యక్రమం భారతదేశ గర్వంగా నిలిచింది





















