Women SI Attacked By Drunk Youth | మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు | ABP Desam
విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో వేణుగోపాలస్వామి జాతర జరుగుతుంది. చాలా ప్రాంతాల నుండి అక్కడకి భక్తులు వస్తుంటారు. అయితే జాతరకు వచ్చిన కొందరు యువకులు తాగిన మత్తులో వీరంగం సృష్టించారు. జాతరలో అసభ్యకర నృత్యాలను అడ్డుకున్నందుకు డ్యూటీలో ఉన్న మహిళా ఎస్సై పై రెచ్చిపోయారు. మహిళా ఎస్సైపై దాడిచేసి, ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు.
గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందీ. పోలీసుల కథనం ప్రకారం.. వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ కార్యక్రమం నిర్వహించారు.
మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు ఎస్సైపై దాడిచేశారు. ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు.
ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని నిందితులు అక్కడికి కూడా వెళ్లి నానా రభస చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.





















