Somasila Project : ప్రమాదం అంచున విహారం..అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్ద సందర్శకుల సందడి పెరిగింది. ఆదివారం కావటంతో ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన చిన్నారులు ఈతకు దిగుతున్నారు. అప్రాన్ దెబ్బతిని ఉండటంతో ఈతకు దిగిన వారు మునిగిపోయే ప్రమాదం ఉంది. కొద్ది రోజులుగా జలాశయానికి వరద వస్తుండటంతో 11,12 గేట్ల ద్వారా పెన్నాకు వరద నీటిని వదిలిపెట్టారు. ప్రాజెక్ట్ ముందు ఉన్న అప్రాన్ దెబ్బతిని ఉండడంతో నీళ్లు అందులోకి వస్తున్నాయి. అక్కడికి వచ్చిన సందర్శకులు ఈ నీటిలోకి దిగి ఈత కొడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో అజాగ్రత్తగా ఉంటున్నారు. అధికారులు పట్టించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




















