వర్షం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని సీతం పేట ఐటీడీఏకు కూత వేటుకు దూరంలో ఉన్న మల్లి పీవీటీజీ రెసిడెన్షియల్ పాత భవనంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు తరగతి గదులన్నీ కారిపోతున్నాయి. మరోవైపు వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు వారి గదుల్లో గొడుగులు వేసుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. భామిని ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. కొత్తూరు పోస్టుమెట్రిక్ వసతిగృహంలో కొన్నేళ్లుగా తాత్కాలికంగానే ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అయితే వసతి సమస్య నెలకొనడంతో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న 112 మంది విద్యార్థులకు మల్లి పీవీటీజీ రెసిడెన్షియల్ పాత భవనం కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడే వారికి తరగతులు నిర్వహిస్తున్నారు. వినాయకచవితి పండుగ సెలవు కావడంతో వీరిలో 45 మంది ఇళ్లకు వెళ్లారు. మిగిలిన 67 మంది వరకు విద్యార్థులు ఆ భవనంలోనే ఉన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వారి వసతి గది పూర్తిగా కారిపోతోంది. దీంతో విద్యార్థులు అక్కడే గొడుగులు వేసుకుని ఉండాల్సి వస్తోంది. ఈ విషయమై మల్లి పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. వర్షాల కారణంగా గదులు కారిపోవడం మాట వాస్తవమేనని తెలిపారు. ఆ విద్యార్థులను వేరే గదుల్లోకి పంపించినట్లు చెప్పారు.