Leopard Spotted in Tirumala | తిరుమలలో ఒకే రోజు రెండు సార్లు కనిపించిన చిరుతపులి
తిరుమలలో మంగళవారం రోజు చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నుంచి ఎస్వీ జూ పార్క్కి వెళ్లే మార్గంలో అరవింద్ ఐ హాస్పిటల్ వద్ద అక్కడే ఉన్న యువకులకు చిరుత కనిపించింది. వాహనాల లైటింగ్కు భయపడి అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలో చిరుత కనిపించడంతో వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు.
అయితే అదే రోజు మరో చోట కూడా చిరుత కనిపించింది. అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇనుప కంచెలు దాటుకుని చిరుత ప్రవేశించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే సైరన్లు మోగించారు. ఆ శబ్దానికి చిరుత మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అన్నమయ్య భవనం వద్దకు చిరుత వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒకే రోజు రెండు చోట్ల చిరుత పులి కనిపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు, చుట్టు పక్కల నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.




















