Gudi Kothuru Village Mystery | అనగనగా ఒకరోజు గ్రామం మొత్తం ఖాళీ చేసేసే సంప్రదాయం | ABP Desam
ఈ పల్లెటూరిని చూడండి. ఊరు మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది కదా. ఇళ్లకు తలుపులన్నీ తాళాలు వేసి ఉన్నాయి. షాపులకు షట్టర్లన్నీ మూసేసి ఉన్నాయి. అసలు ఏంటీ ఊళ్లో మనుషులు కనపడటం లేదనే కదా మీ డౌట్. అవును అదే ఈ ఊరంతా ఖాళీ చేసేశారు.చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలోని గుడి కొత్తూరు గ్రామం ఇది. ఇక్కడ పూర్వీకుల నుంచి ఓ వింత ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు గ్రామస్థులు. 100 గడపలు ఉండే ఈ ఇంటిలో గ్రామానికి, గ్రామంలోని ప్రజలు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ఐదేళ్లకోసారి ఊరు మొత్తం ఖాళీ చేయాలనేదే ఆ వింత ఆచారం. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆషాఢ మాసంలో ఈ ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తుంటారు. సూర్యోదయానికి ముందే గ్రామంలో ప్రజలు వాళ్లు పెంచుకునే ఆవులు, జంతువులు, ఆఖరికి వాహనాలతో కలిసి మొత్తం కాళీ చేసి గ్రామానికి సరిహద్దు అవతల ఉంటే వనదేవత చెట్టు దగ్గరకి చేరుకుంటారు. గ్రామంలోని ఆలయ నుంచి తీసుకువచ్చిన వనదేవతకు, గంగమ్మ, సల్లా బ్రహ్మన్న దేవతామూర్తులకు అలంకరణ చేసి జంతు బలులు సమర్పిస్తారు. తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి ఒకే చోట వంట చేసుకుని వనభోజనాలు చేస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమయం కోసం అంతా వేచి చూస్తారు. పొద్దు పోయిన తర్వాత అందరూ ఊరి బాట పడతారు. సాయంత్రం పూజారి చేత పూజలు నిర్వహించి పుణ్యహవచన నీటిని అక్కడి నుంచి ప్రతి ఇంటి కి చల్లుకుంటూ తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్తారు. గ్రామానికి శుద్ధిచేయటం..ప్రజలంతా ఐకమత్యంగా ఉండటానికి తమ పూర్వీకులు ఈ ఆచారం పెట్టారని..గ్రామం నుంచి బయటకు వెళ్లి దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆ రోజు గ్రామానికి వచ్చి తమతో పాటే గడుపుతారని గుడికొత్తూరు గ్రామస్థులు చెబుతున్నారు.