Kanipakam Brahmostavas: కాణిపాకం బ్రహ్మోత్సవాలు... నెమలి వాహనంపై దర్శనమిచ్చిన వినాయకుడు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నెమలి వాహనంపై వినాయకు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం మూలవిరాట్ కు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సిద్ధి, బుద్ధి, సమేత శ్రీ స్వామి వారిని అలంకార మండపంలో ఉంచి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఉత్సవ మూర్తులను నెమలి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ వాహన సేవకు చినకాంపల్లె, అగరం పల్లె, కాణిపాకం, పరిసర గ్రామస్థులు, రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామి వారి వాహన సేవకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఈ సేవలో ఆలయ అధికారులు, ఉభయదారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.





















