Self-Marriage Ceremony:సెల్ఫ్ మ్యారేజ్ చెల్లుతుందా..? ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది..?
సెల్ఫ్ మ్యారేజ్ చట్టబద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత్‌కు కొత్తే అయినా అంతర్జాతీయంగా ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది.
వడోదర అమ్మాయి సెల్ఫ్ మ్యారేజ్
"ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనల్ని మనం ప్రేమించుకోవటం చాలా ముఖ్యం". ఆత్మన్యూనతతో బాధ పడే వాళ్లకి ఈ సలహా ఇస్తుంటారు సైకియాట్రిస్ట్‌లు. సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్లు మనలో చాలా మందే ఉంటారు. సోషల్ మీడియాలో బయోలో చాలా మంది సెల్ఫ్ లవ్ అని రాసుకోవటమూ ట్రెండ్ అయింది. ఇప్పుడీ ట్రెండ్ పోయి మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే సెల్ఫ్ మ్యారేజ్. అంటే మనల్ని మనమే పెళ్లి చేసుకోవటం అన్నమాట. వడోదరకు చెందిన ఓ 24 ఏళ్ల యువతి తనను తాను పెళ్లి చేసుకుంటానని చెప్పటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంత సెల్ఫ్ లవ్ ఉంటే మాత్రం తనను తాను పెళ్లాడటమేంటి విడ్డూరం కాకపోతేనూ అని అందరూ పెదవి విరుస్తున్నా ఆ అమ్మాయి మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు. పైగా తన పెళ్లికి జూన్ 11న ముహూర్తం కూడా పెట్టుకుంది. అప్పటి నుంచి ఆ అమ్మాయి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మనల్ని మనం పెళ్లి చేసుకోవటం సాధ్యమవుతుందా..? ఇది చట్టపరంగా చెల్లుతుందా..? ఇంతకు ముందు ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయా..? ఇలా బోలెడన్ని ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
సెల్ఫ్ మ్యారేజ్ ట్రెండ్ అప్పుడే మొదలైందా..?
సోలోగమీ, ఆటోగమీ, సెల్ఫ్ మ్యారేజ్..ఇలా రకరకాల పేర్లతో పిలుచుకున్నా అన్నింటి అర్థం తనను తాను వివాహమాడటం అనే. అందరి సమక్షంలో జరిగినప్పటికీ..ఇలాంటి పెళ్లిళ్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదు. కేవలం స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వాళ్లు, తమకంటూ ఓ అండ ఉండాల్సిన అవసరం లేదని భావించే వాళ్లు మాత్రమే ఇలా సెల్ఫ్ మ్యారేజ్ వైపు అడుగులు వేస్తారన్నది మానసిక నిపుణుల వివరణ. భారత్‌లో ఇది తొలి సంఘటన కాబట్టి ఇంత వింతగా అనిపిస్తోంది కానీ...ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొందరు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్నారు.
1993లో మొదటిసారి ఈ ట్రెండ్ మొదలైంది. అమెరికాలోని లిండర్ బేకర్ అనే ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వివాహం జరగటం ఇదే తొలిసారి. బంధుమిత్రులందరినీ పిలిచి మరీ తనను తాను వివాహమాడారామె. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఇలాంటి పెళ్లిళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. బ్రెజిల్‌కి చెందిన ఓ మోడల్ తనను తాను వివాహమాడిన 90 రోజుల తరవాత విడాకులు ఇచ్చుకున్నారు. జీవిత భాగస్వామి దొరికాడని అందుకే డైవర్స్ తీసుకుంటున్నానని ఆమె చెప్పారు.
సెల్ఫ్ మ్యారేజ్‌కి స్పెషల్ ప్యాకేజ్‌లు
ఈ సెల్ఫ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి సహకరిస్తున్నారు సర్వీస్ ప్రొవైడర్లు. కెనడాలో "మ్యారీ యువర్‌సెల్ఫ్" పేరుతో ప్రత్యేకంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ షూట్‌లు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో సెల్ఫ్ మ్యారేజ్ కిట్స్ కూడా ఇస్తున్నారు. అసలు ఎందుకీ ట్రెండ్ మొదలైందని ఆరా తీస్తే మానసిక నిపుణులు తమతమ అభిప్రాయాలు పంచుకున్నారు. అమ్మాయిలకు 20 ఏళ్లు దాటగానే పెళ్లి చేసుకోవాలంటూ ఇళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. మరీ ఆలస్యమైతే మంచిది కాదంటూ పెద్దలు పదేపదే హెచ్చరిస్తుంటారు. వీటిని తట్టుకోలేకే కొందరు అమ్మాయిలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారని చెబుతున్నారు సైకియాట్రిస్టులు. ఇదీ మొత్తంగా..సెల్ఫ్ మ్యారేజ్ కహానీ.