Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!
చనిపోయిన మనిషి డెడ్ బాడీని ఏడాదిగా ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎప్పటికైనా లేస్తాడని నమ్మి ప్రతిరోజూ శవం మీద గంగా జలం చల్లుతూ వస్తున్నారు. చివరకు పోలీసుల రంగప్రవేశంతో ఏం జరిగిందంటే..
అత్యంత ఆప్తులు చనిపోతే చాలా మంది ఎంతో బాధపడతారు. దుఃఖంతో వెక్కివెక్కి ఏడుస్తారు. కానీ, చావును ఎవరూ ఆపలేరు. ఎవరు చనిపోయినా తిరిగి రాలేరని అందరికీ తెలుసు. చనిపోయిన రోజే భౌతికంగా కనిపిస్తారు. ఆ మరుసటి రోజు స్మశానానికి తీసుకెళ్లాల్సిందే. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయాల్సింది. ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలించి, వారి జ్ఞాపకాలను ఆ ఫోటోలో చూసుకోవాల్సిందే. కానీ, ఉత్తర ప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడియే సంఘటన జరిగింది. గతేడాది క్రితం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు ఓ కుటుంబ సభ్యులు. ఎప్పటికైనా ఆయన లేచి వస్తాడని భావించి.. నిత్యం ఆయన శవం మీద గంగాజలం చల్లేవారు. ఆదాయ పన్ను శాఖలో పని చేసే ఉద్యోగి కావడంతో.. ఆశాఖ వారికి అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఖాకీల రంగ ప్రవేశంతో అసలు విషయం బయటపడింది.
ఏడాదిగా ఇంట్లో మృతదేహాన్ని ఎలా ఉంచారు?
కాన్పూర్ లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయం లో పనిచేసే విమలేశ్ దీక్షిత్ గత సంవత్సరం ఏప్రిల్ లో అనారోగ్యంతో చనిపోయారు. అతను మృతి చెందినట్లు డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఇంటికి వచ్చాక ఎందుకో అతను చనిపోలేదు అనే అనుమానం కలిగింది. ఇంట్లో వాళ్లు అతను కోమాలో ఉన్నట్లు భావించారు. ఎప్పటికైనా మామూలు మనిషి అవుతారని నమ్మారు. దాదాపు ఏడాదిన్నరగా ఇదే ఆలోచనలో ఉన్నారు. బంధుమిత్రులకు, చుట్టుపక్కల వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అందరూ అతను బతికే ఉన్నారని నమ్మారు.
ఆదాయ పన్ను శాఖ అధికారులకు అనుమానం
కాన్పూర్ పోలీసుల సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి విమలేష్ దీక్షిత్ ఏప్రిల్ 22, 2021న మరణించారు. దీక్షిత్ మరణానంతరం "కాన్పూర్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు నాకు సమాచారం అందించారు. కమలేష్ కుటుంబానికి సంబంధించిన పెన్షన్ ఫైల్ కు సంబంధించి ఎలాంటి పురోగతి లేనందున ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అభ్యర్థించారు" అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ రంజన్ చెప్పారు. పోలీసులు, మేజిస్ట్రేట్‌తో పాటు ఆరోగ్య అధికారుల బృందం కలిసి రావత్‌పూర్ ప్రాంతంలోని దీక్షిత్ ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. అప్పుడు అతడి కుటుంబ సభ్యులు తను సజీవంగా కోమాలో ఉన్నారని పట్టుబట్టారని రంజన్ చెప్పారు. అధికారులు ఎంత సర్ది చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు.
చివరకు ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయిస్తామని చెప్పి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో పరీక్ష చేయించి ఆ వ్యక్తి చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ముందే నిర్ధారించారు. దాంతో ఆ మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. వాస్తవానికి మృతదేహాన్ని పూర్తిగా క్లోత్స్ తో కప్పారని, మృతదేహం చెడిపోకుండా కొన్ని రసాయనాలు పూశారని.. అందుకే మృతదేహం దుర్వాసన రాలేదని అధికారులు వెల్లడించారు. విమలేష్ భార్య మానసిక పరిస్థితి అదుపుతప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు.