Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Viral News: తమకు అదృష్టంతో పాటు గౌరవాన్ని తెచ్చిన కారుకు ఓ కుటుంబం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
Gujarat Family Funeral To Lucky Car: మనుషులకు అంత్యక్రియలు చేయడం చూశాం. తమ కుటుంబంలో భాగమైన పెంపుడు జంతువులు చనిపోయినా కన్నీటితో వాటికి అంత్యక్రియలు నిర్వహించడమూ మనం చూసుంటాం. అయితే, ఓ కుటుంబం మాత్రం కారుకు అంత్యక్రియలు నిర్వహించింది. మీరు చదివింది నిజమే. ఆ కారు వల్ల తమకు అదృష్టం వచ్చిందని.. దాన్ని విక్రయించడానికి బదులుగా అంత్యక్రియలు చేసినట్లు సదరు కుటుంబం చెబుతోంది. అంతే కాదండోయ్.. ఈ కార్యక్రమం కూడా ఏదో ఆషామాషీగా చేసెయ్యలేదు. సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు సహా 1500 మంది సమక్షంలో రూ.4 లక్షలతో ఖర్చుతో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించారు. మరి ఆ కథేంటో తెలియాలంటే ఇది చదివేయండి.
గుజరాత్‌లోని (Gujarat) అమ్రేలీ జిల్లా పదార్‌శింగా గ్రామంలోని సంజయ్ పోలారా (Sanjay Polara) అనే రైతు కుటుంబం కారుకు అంత్యక్రియలు నిర్వహించింది. తమకు అదృష్టాన్ని తీసుకొచ్చిన కారుకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ నెల 7న (గురువారం) తుది వీడ్కోలు పలికింది. తమ ఇంటి నుంచి పొలం వరకూ కారును ఊరేగింపుగా తీసుకెళ్లారు. వాహనాన్ని పువ్వుల మాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు సహా దాదాపు 1500 మంది హాజరయ్యారు. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.4 లక్షలు ఖర్చు చేశారు. 15 అడుగుల గొయ్యి తవ్వి.. అందులో కారును పూడ్చిపెట్టారు.
'అదృష్టంతో పాటు గౌరవం'
12 ఏళ్ల క్రితం మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు కొన్నానని.. కారు యజమాని సంజయ్ పోలారా తెలిపారు. ఈ కారు తన కుటుంబానికి అదృష్టంతో పాటు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అందుకే దాన్ని ఇతరులకు విక్రయించడానికి బదులుగా నివాళిగా తమ పొలంలోనే పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కారు సమాధి మీద ఓ చెట్టును కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.