Finland Electricity Bill: మైనస్‌లో కరెంటు బిల్లు, ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్న ఫిన్‌లాండ్
Finland Electricity Bill: ఫిన్‌లాండ్ లో కరెంటు బిల్లు మైనస్ లో వస్తోంది. అతిగా కరెంట్ ఉత్పత్తి చేస్తూ ఇబ్బంది పడుతోంది ఆ దేశం.
Finland Electricity Bill: కూరగాయల నుంచి ప్రతి ఒక్కదాని రేటూ పెరుగుతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. తీవ్రమైన ద్రవ్యోల్బణం వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా మొదలైన ధరల పెరుగుదల.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో మరింతగా పెరిగింది. ఈ రెండు కారణాల వల్ల పలు దేశాల ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. మిగతా దేశాల్లో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఫిన్‌లాండ్ దేశంలో మాత్రం ధరలు తగ్గి జీరోకు చేరి అంతకంటే కూడా తగ్గిపోతూ ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్నాయి. ఫిన్‌లాండ్ లోని కరెంటు బిల్లుల తీరు మనకు ఆశ్చర్యంగా కనిపిస్తున్నా.. ఫిన్‌లాండ్ ను మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వింత సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కరెంటు బిల్లు మైనస్ గా వస్తోంది
వింతగా అనిపించే సమస్యతో బాధపడుతోంది ఫిన్ లాండ్. ఈ రోజుల్లో ఇలాంటి సమస్య ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నా.. ఫిన్‌లాండ్ దేశం ఎదుర్కొంటున్న సమస్య మాత్రం నిజం. ఫిన్లాండ్ దేశం స్వచ్చమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీంతో ఇంధన ధరలు ఆ దేశానికి ప్రతికూలంగా మారాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు సైతం జుట్టు పీక్కుంటున్నారు.
వాడుకోలేనంత విద్యుత్తు ఫిన్‌లాండ్ సొంతం
ఫిన్లాండ్ పునరుత్పాదక శక్తిని సమృద్ధిగా ఉత్పత్తి చేస్తున్న దేశం. విద్యుత్ సగటు ధర సున్నా కంటే దిగువకు చేరుకుందని ఫిన్లాండ్ గ్రిడ్ ఆపరేటర్ ఫింగ్రిడ్ సీఈవో జుక్కా రుసునెన్ పేర్కొన్నారు. ఫిన్లాండ్ లో వాడుకోలేనంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. ఇలా ఎప్పుడూ జరగదని, కానీ ఫిన్లాండ్ మాత్రం ఇలాంటి విచిత్రమైన సమస్యతో ఇబ్బంది పడుతోందని రుసునెన్ వ్యాఖ్యానించారు.
ఇదంతా ఎలా జరిగింది?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఫిన్లాండ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంది. విద్యుత్తును తెలివిగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది కూడా. ఈ మేరకు పలుమార్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఫిన్లాండ్ ప్రభుత్వం. ఆ తర్వాత ఫిన్లాండ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. చాలా ప్రాంతాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్లను ప్రారంభించింది. ఫలితంగా కొన్ని నెలల్లోనే అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి కావడం మొదలైంది. దీని వల్ల ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిన్లాండ్ దేశానికి అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అక్కడి అధికారులు సైతం చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ ను అమ్ముకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
పరిష్కారం కోసం వెతుకుతున్న ఫిన్లాండ్
ఫిన్లాండ్ జనాభా దాదాపు 5.5 మిలియన్లు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఫిన్లాండ్ కొత్త అణు రియాక్టర్ కూడా ప్రారంభించినట్లు ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఇప్పటికే విద్యుత్ ధరలను 75 శాతానికి పైగా తగ్గించింది.