Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !
పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడటంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రతోనే ఇలా చేశారని షర్మిల ఆరోపించారు.
Sharmila Arrest : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్సంపేట్ నియోజకవర్గంలో లింగగిరి దగ్గర షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ లో కాన్వాయ్ లోని బస్ కు కొంత మంది నిప్పు పెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై టీ రాళ్లు రువ్వారు. పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజా ప్రస్థానం పాద యాత్రను అడ్డుకోవడానికే ఉద్రిక్తలు సృష్టించి అరెస్ట్ చేశారని షర్మిల ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండిపడ్డారు.
https://t.co/qogJyIbl8x
— YS Sharmila (@realyssharmila) November 28, 2022
ప్రజలపక్షాన పోరాడుతున్న నన్ను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పోలీసులను పనివాళ్లలా వాడుకుంటూ.. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పుతోంది. బస్సులు తగలబెడుతూ, దాడులకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? తాలిబన్ల రాజ్యమా?#Narsampet
ఉదయం నుంచి ఉద్రిక్తతలు
ఈ ఉదయం నుంచి ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెన్నారావుపేటలో షర్మిల వ్యాన్‌ను తగలపెట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇటు పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు.. అటు టీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో పరిస్థితి హైటెన్షన్‌గా మారింది. ఈ క్రమంలో లింగగిరి క్రాస్ రోడ్స్ దగ్గరకు చేరుకోగానే.. పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.
కావాలనే ఉద్రిక్తతలు సృష్టించి పాదయాత్రను ఆపారని షర్మిల ఆరోపణ
పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని తెలిపారు. బస్సు అద్దాలు రాళ్లతో పగలగొట్టి, కారుతో దాడి చేయించి..వైఎస్సార్టీపీ కార్యకర్తలను కొట్టారని చెప్పారు.బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు పర్మీషన్ ఉందని..కావాలనే పాదయాత్ర వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపించారు. బస్సుకు నిప్పుపెట్టిన అనంతరం తమ కార్యకర్తలు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఇలాంటి దాడులకు భయపడబోమని..ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేది లేదని తేల్చిచెప్పారు.
భారీ బందోబస్తు మధ్య పాదయాత్ర
పాదయాత్రను అడ్డుకుంటారన్న సమాచారం ఉండటంతో ముందుగానే పోలీసులు ప్రత్యేకమైన భద్రత కల్పించారు. నర్సంపేట నియోజకవర్గంలో ముడో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. నర్సంపేట మండలం రాజపల్లి నుంచి మొదలైన పాదయాత్ర భారీ బందోబస్తు మధ్య పాదయాత్ర కొనసాగుతోంది. నిన్న నర్సంపేట పట్టణంలో జరిగిన భారీ బహిరగసభలో నర్సంపేట ఎమ్మెల్యేపై షర్మిల చేసిన కామెంట్స్ కారణంగా దాడులు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. అయినా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.