Worldcup 2023 Fever: వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ - క్రికెట్ 'అభిమాన'మే ఎన్నికల ప్రచారం
World cup Final Fever: వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ ను 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సారధిగా మార్చుకున్నాయి. ఓవైపు ప్రచారంతో హోరెత్తిస్తూనే, మరోవైపు విమర్శ ప్రతి విమర్శలతో చెలరేగాయి.
Political parties used Worldcup Fever in Election Campaign: వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ ముగిసింది. క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. అహ్మదాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాంటింగ్ లో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వ విజేతగా అవతరించింది. అయితే, ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీలు క్రికెట్ అభిమానమనే ఫీవర్ ను సోషల్ మీడియా సహా బాగా వాడుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓవైపు పొలిటికల్ హీట్, మరోవైపు క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల జోష్ ను తమ ప్రచారంతో మరింత పెంచాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆదివారం ప్రచారం సందర్భంగా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. క్రికెట్ అభిమానులు మ్యాచ్ వీక్షిస్తూ సందడి చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎటు చూసిన కోలాహలం కనిపించింది. తమ ఎన్నికల ప్రచారంతో పాటు క్రికెట్ అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చేలా ప్రయత్నాలు చేశారు. అటు పెళ్లిళ్లలో సైతం మ్యాచ్ మిస్ కాకుండా భారీ తెరలు ఏర్పాటు చేసి వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఏపీలోనూ భారీ స్క్రీన్లు
అటు, ఏపీలోనూ క్రికెట్ అభిమానుల కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) విశాఖ, విజయవాడ, ఏలూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు, ఒంగోలు, తిరుపతి, విజయనగరం ఇలా 13 చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. వేల మంది వీక్షించేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. మరోవైపు, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ ఫైనల్ వార్ ను సోషల్ మీడియాలో తమ తమ పార్టీ జెండాలు పెట్టి ట్రోల్ చేస్తూ విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఆ పార్టీ వాళ్లు ఫోటోలతో హల్ చల్ చేయగా, దీనిపై టీడీపీ సైతం కౌంటర్ ఇచ్చింది. అయితే, లాజిక్ ప్రకారం వైసీపీదే విజయమని ఫైనల్ రిజల్ట్ ను ఆ పార్టీ మద్దతుదారులు ట్రోల్ చేయగా, దేశానికి సంబంధించిన క్రికెట్ మ్యాచ్ లకు ఎన్నికల్లో విజయాలకు ఏం సంబంధం లేదంటూ టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి.
అయితే, వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ ఇప్పటికే వదిలిపోగా, ఇంకా పొలిటికల్ ఫీవర్ మాత్రం వదల్లేదు. తెలంగాణలో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితం తేలిపోనుండగా, ఏపీలో మరో 4 నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.