(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Elections 2023: 'కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా.?' - హస్తానికి అధికారమిస్తే జరిగేది భూ'మేత' అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు
CM KCR: తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమేతే అవుతుందని తీవ్ర విమర్శలు చేశారు.
CM KCR Comments in Manukonduru: తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపితే 58 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆమె పరిపాలనే బాగుండుంటే ఎన్టీఆర్ టీడీపీని ఎందుకు పెడతారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన పార్టీ పెట్టి రూ.2 లకే కిలో బియ్యం అందించి పేదల కడుపు నింపారని గుర్తు చేశారు. రైతుల గుండెలు పగిలింది కాంగ్రెస్ హయాంలోనేనని విమర్శించారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెబుతున్నారని, అది రద్దు చేస్తే మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కేసీఆర్ చెప్పారు. కొత్తగా 'భూమాత' పోర్టల్ తెస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని, వారు అధికారంలోకి వస్తే జరిగేది భూమాతనా? లేక భూమేతనా? అని ప్రశ్నించారు. ధరణిని బంద్ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయన్నారు. 'ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్ పుట్టింది. స్వరాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేసి అధిక సంఖ్యలో జైలు పాలయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో 400 మందిని కాల్చి చంపారు. 2001లో మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఇస్తామని చెప్పి 2004లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వకుండా 15 ఏళ్లు బాధపెట్టారు' అని కేసీఆర్ పేర్కొన్నారు. అనేక పోరాటాల తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక రాష్ట్ర ప్రకనట వచ్చినా, తెలంగాణ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. సకల జనుల సమ్మె పేరుతో మలి ఉద్యమం చేస్తే తప్ప ప్రత్యేక తెలంగాణ కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు.
'ప్రజలు ఆలోచించాలి'
చాలా సార్లు అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వారు ఏం చేశారు.? అవకాశం ఇస్తే ఇంకా ఏం చేస్తారనే విషయాలను ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే అందరూ చెప్పే మాటలు విని ఆగం కావొద్దని, విచక్షణతో ఎవరు మంచి చేస్తారో చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందని అన్నారు. 'కాంగ్రెస్ హయాంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందా.?. ఇందిరమ్మ రాజ్యంలో ధనికుడు మరింత ధనవంతుడయ్యాడు. లేనోడు మరింత పేదవాడయ్యాడు.' అని కేసీఆర్ మండిపడ్డారు.
'వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే'
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని పింఛన్లు పెంచుకుంటూ పోయాం. మిషన్ భగీరథ, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, కంటి వెలుగు, రైతుబంధు, దళిత బంధు తెచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కారణంగా పొలాలు కళకళలాడుతున్నాయి. ఎటు చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి.' అని వివరించారు. ఈ రోజు అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఆ అభివృద్ధి అలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కే ఓటేసి గెలిపించాలని కోరారు.
Also Read: Amit Shah Speech: డిసెంబరు 3న మరో దీపావళి, జనవరిలో ఇంకోటి - అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు