World Adivasi Day: కుమ్రంభీం వారసులకు తీరని కష్టాలు, పోరాటాలే స్ఫూర్తిగా జీవనం - నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కుమ్రం భీమ్ వారసులకు నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి అభివృద్ది ఫలాలు అందడం లేదు. ఉద్యమాలే.. ఊపిరిగా వారి జీవన విధానం కొనసాగుతోంది.
World Adivasi Day 2024: అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా అడవుల్లో ఆదివాసిలే నివసిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గల ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీ పోరాట వీరుడు కుమ్రం భీమ్ వారసులకు నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి అభివృద్ది జరగడం లేదు. "ఉద్యమాలే.. ఊపిరిగా" వారి జీవన విధానం కొనసాగుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వం 1970లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ను ఉట్నూర్ లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం, గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు వారికి జీవనోపాధి కోసం వివిధ రకాల రుణాలు అందిస్తూ ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశం. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వాలు ప్రతి ఏటా ఐటీడీఏకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటాయి. ఏటా రూ. కోట్లాది నిధులు విడుదల చేసినా ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ అనేక ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కనీస వసతులు కనిపించడం లేదు.
కనీస వసతులకు దూరం
కొన్ని గ్రామాలకు అటవీ అనుమతులు అడ్డంకిగా మారడంతో రోడ్లు వేయలేకపోగా.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక గ్రామాలకు రోడ్లు, వాగులపై వంతెనలు లేకుండా పోయాయి. అత్యవసరంలో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో మార్గమధ్యలోనే గర్భిణీలు ప్రసవం అవుతున్న సందర్భాలున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల గర్భిణులను ముందస్తుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీటి సరఫరాలోనూ అంతరాయం అనేక గిరిజన గ్రామాల్లో ఎండకాలంలో నీటి కటకట ఏర్పడుతుంది. మిషన్ భగీరథ వచ్చినా.. నీటి సరఫరాలో అంతరాయం కారణంగా వాగులు, చెలిమెల నీటినే తాగాల్సి వస్తోంది. వర్షాకాలంలో శుద్దనీరు లభించని పరిస్థితి.. బావులు, చేతిపంపుల నీటిని తాగుతుండటంతో ఏజెన్సీ ప్రాంతం విష జ్వరాలతో విలవిల్లాడుతుంది.
కరెంటు లేని ఊర్లు ఎన్నో
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సుమారు 50కి పైగా గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదు. త్రీఫేజ్ విద్యుత్తు కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వీటితో పాటు పోడు భూముల సమస్య వారిని తీవ్రంగా వేధిస్తోంది. గతంలో గిరిజనుల జీవనోపాధి కోసం వ్యవసాయానికి, బావులు, ఎడ్ల జతలు, మేకలు, గొర్రెలు, ఆయిల్ ఇంజన్లు, స్ప్రింకర్లు అందించేవారు. కానీ పదేండ్ల నుంచి ఇలాంటి పథకాలన్నీ ఆగిపోయాయి. ట్రైకార్ రుణాలు అందిస్తున్నా.. అవి కొందరికి మాత్రమే పరిమితమవుతున్నాయి. గిరివికాసం కింద పంట పొలాల్లో బోర్లు వేస్తున్నా.. త్రిఫేజ్ విద్యుత్ సరఫరా కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది.
ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ చట్టాలు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టంతో పాటు పీసా వంటి చట్టాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆదివాసీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ గ్రామాల్లో ఏ పని తలపెట్టాలన్నా గ్రామ సభ తీర్మానం తప్పనిసరి.. కానీ చాలా చోట్ల ఇలాంటి నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారీతిన పనులు చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం పోరాటం... భూమి కోసం భుక్తి కోసం అసువులు బాసిన ఇంద్రవెల్లి పోరాటం స్ఫూర్తిగా కల్పించిన హక్కులు కూడా నేటికీ సరిగా దక్కడం లేదు. పైగా.. టైగరోజోన్, ఓపెన్కాస్ట్ ల పేరిట ఆదివాసీ గిరిజనులను అడవి నుంచి వెళ్లగొడుతున్నారని ఆదివాసీల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని "కవ్వాల్ అభయారణ్యం"లోని రెండు గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. నిర్మల్ జిల్లా పరిధిలోని కడెం మండలంలో గల "రాంపూర్, మైసంపేట" గ్రామాల ఆదివాసి గిరిజనులను ఖాళీ చేశాక ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని వారికి వెసులుబాటు కల్పించేందుకు కడెం సమీపంలోని కొత్త మద్దిపడగా సమీపంలో పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు.. కానీ పరిహారం మరియు బ్రతకడానికి సాగు భూమి ఇంకా అందలేదు. పలుమార్లు ఇన్చార్జి మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు మరియు జిల్లా కలెక్టర్లకు తెలిపిన నేటికీ వారికి అవి అందలేదు. తమ హక్కులు, మెరుగైన జీవనం కోసం ఇప్పటికీ ప్రతినిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు చెబుతున్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించినా.. పాలక ప్రభుత్వం ఇంకా గుర్తించడం లేదనీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించి సెలవు దినం ప్రకటించాలని, అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ఆదివాసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో కృషి చేయాలనీ, ఆదివాసీ గిరిజనుల భాష అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున పరిరక్షణపై చర్యలు చేపట్టాలని, గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు మానుకోవాలనీ, అటవీపై హక్కులు కల్పించాలనీ, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ వేడుకుంటున్నారు.