Warangal News: ములుగు జిల్లాలో షాకింగ్ ఘటన - పాముతో సహా ఆస్పత్రికి వెళ్లిన మహిళ, ఎందుకంటే?
Telangana News: పాముకాటుకు గురైన మహిళ ఆ పామునే చంపి దానితో సహా చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
Warangal Woman Went To Hospital Along With Snake: ఉపాధి కూలీకి వెళ్లిన ఓ మహిళ పాముకాటుకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ పామును చంపి దాంతో సహా ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లింది. పాముతో సహా వచ్చిన మహిళను చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ములుగు (Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వెంకటాపురం (Venkatapuram) మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఉపాధి పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన మహిళ సహచర కూలీలతో పామును కొట్టి చంపింది. అనంతరం, వైద్యులకు ఏ పాము కరిచిందో తెలిసేందుకు ఆ పాముతో సహా ఆస్పత్రికి తీసుకెళ్లింది. తొలుత పాముతో వచ్చిన మహిళను చూసి షాకైన డాక్టర్లు అనంతరం అది విషపూరిత పాముగా గుర్తించి బాధితురాలికి చికిత్స అందించారు. ప్రస్తుతం శాంతమ్మ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.