Hyderabad News: తీసుకున్న అప్పు చెల్లించలేదని దారుణం - నడిరోడ్డుపై రూ.కోట్ల కారును తగలబెట్టేశారు, ఎక్కడంటే?
Rangareddy News: తీసుకున్న అప్పు చెల్లించలేదనే అక్కసుతో ఓ వ్యక్తి ఖరీదైన స్పోర్ట్స్ కారును నడిరోడ్డుపైనే తగలబెట్టాడు. పహాడీషరీఫ్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spots Car Set On Fire In Hyderabad: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే అక్కసుతో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే రూ.కోట్ల విలువైన లాంబొర్గిని కారును నడిరోడ్డుపైనే తగలబెట్టేశాడు. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి లాంబొర్గిని స్పోర్ట్స్ కారు కొనుగోలు చేశాడు. దీన్ని అమ్మాలని నిర్ణయించుకుని తనకు పరిచయస్థుడైన అయాన్ అనే వ్యక్తికి చెప్పాడు. దీంతో అయాన్.. మొఘల్ పురాకు చెందిన తన స్నేహితుడు అమన్ అనే వ్యక్తికి చెప్పాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్ కు, అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. మామిడిపల్లి టు శంషాబాద్ రూట్ కు వెళ్లే దారిలో ఉన్న ఫాం హౌజ్ కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు.
కోపంతో కారుకు నిప్పు
నీరజ్ దగ్గర నుంచి అయాన్ కారును తీసుకొచ్చి అమన్ కు ఇవ్వగా.. అతను మరో స్నేహితుడు హందాన్ తో కలిసి కారును అహ్మద్ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్ పోర్ట్ రోడ్డు మధ్యలో ఆపారు. అప్పుడే, అహ్మద్ తో పాటు మరికొంతమంది కారు వద్దకు చేరుకుని నీరజ్ ఎక్కడ.?. అతను మాకు డబ్బులివ్వాలి అంటూ దుర్భాషలాడారు. నీరజ్ ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్, అతని వెంట వచ్చిన వారు బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ పోసి కారుకు నిప్పంటించి పరారయ్యారు. దీంతో ఆందోళనకు గురైన అమన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఓనర్ నీరజ్.. అహ్మద్ కు రూ.2 కోట్ల అప్పు ఉండగా.. ఆ విషయం చెప్పకుండా మూడో వ్యక్తి ద్వారా కారును తెప్పించుకుని ఇలా చేసినట్లు తెలుస్తోంది. కారు దగ్ధం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, మార్కెట్లో లాంబోర్గిని కారు ధర రూ.4 కోట్లు ఉంటుంది.
Also Read: Warangal News: నానమ్మ ఛాతిలో కత్తితో పొడిచిన మనవడు, 14 ఏళ్ల వయసులోనే ఘోరం!