Rains In AP Telangana: తీవ్ర అల్పపీడనంతో మరో రెండు రోజులు అక్కడ భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
Rains in Telangana AP: దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో 36 గంటల్లో ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వీచనున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో సెప్టెంబర్ 14 వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిశాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.
నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని నేడు సైతం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు..
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం ఏపీపై ఉన్నా, ఉత్తర కోస్తాంధ్ర వరకే పరిమితమైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్.టీ.ఆర్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటివరకూ కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో వరదతో కొన్నిచోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.