Weather Latest Update: నేడు అన్ని జిల్లాల్లో మండిపోనున్న ఎండలు! ఇక్కడ మాత్రం మేఘావృతంగా వాతావరణం
ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం గత ప్రకటనలో తెలిపింది.
Weather Update: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
Hyderabad Weather: హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది.
Andhra Pradesh Weather Update: ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
Delhi Weather: ఢిల్లీలో వాన
ఢిల్లీలో హోలీ రోజు వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. నేడు కూడా పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
మార్చి 13 నాటికి ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు
మార్చి 13 నాటికి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఢిల్లీలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గత 63 ఏళ్లలో మూడవసారి, ఈ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి, మే మధ్య హీట్ వేవ్‌లు బలంగా మారనున్నట్లు తెలుస్తోంది.